రోజా ప్రశ్నలకు బదులిచ్చేదెవరు.?

'ఎమ్మెల్యే రోజా మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే..' అంటూ పోలీస్‌ అధికారుల సంఘం ఇచ్చిన అల్టిమేటంకి ఆమె ఇంకా ఘాటుగానే స్పందించారు. నన్ను క్షమాపణ అడిగేముందు, మీరేం చేశారో ఒక్కసారి ఆలోచించుకోండంటూ కౌంటర్‌ ఇచ్చారు రోజా. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, పోలీసులపై దాడి చేసినప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏం చేసిందని ప్రశ్నించారామె. అంతేనా, చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు వసతుల్లేక పడ్తున్న పాట్లు గురించీ ప్రస్తావించారు. ఇంకా చాలా చాలానే మాట్లాడేశారు. రోజాతో పెట్టుకుంటే అంతే మరి.! 

రాజకీయ నాయకుల విషయంలో పోలీసుల తీరు ప్రతిసారీ ఇబ్బందికరమే. అటూ చెప్పలేక, ఇటూ చెప్పలేక పోలీసులు నానా తంటాలూ పడ్తుంటారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, పోలీసులపైనే కాదు మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగంపై అధికార పార్టీ పెత్తనం సుస్పష్టం. ఎవరి పని వారిని చెయ్యనివ్వరు ఎవరు అధికారంలో వున్నాసరే. పోలీసుల విషయంలో మరీ దారుణంగా వుంటుందీ అధికార క్రీడ. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. పోలీసుల్ని, విపక్షాల పైకి ఉసిగొల్పడం అన్నది అనాదిగా జరుగుతున్న ఓ ప్రసహమే. 

మరీ ముఖ్యంగా టీడీపీ అధికారంలో వున్నప్పుడు, పోలీసు శాఖతో ఓ ఆట ఆడుకోవడం చూస్తూనే వున్నాం. రాజమండ్రికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు, పోలీసుల్ని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. నిత్యం ఆయన వివాదాల్లోకెక్కుతూనే వుంటాడు. విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సంగతి సరే సరి. చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలానే వుంది. అధికారం మాది, ఒళ్ళు దగ్గరపెట్టుకుని వుండండి.. అంటూ పోలీసుల్ని హెచ్చరించే నేతలకు కొదవేమీ లేదిప్పడు. కానీ, పోలీసు అధికారుల సంఘం ఇలాంటి ఘటనల విషయంలో మాత్రం పెదవి విప్పదు. 

మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు కోసం ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే హోదాలో రోజాకి ఆహ్వానం అందినప్పుడు, ఆమెను అడ్డుకునే హక్కు పోలీసు శాఖకు ఎలా వుంటుంది.? అలా అడ్డుకోవడం అధికార పార్టీకి బానిసత్వం లాంటిదేనని రోజా చేసిన విమర్శలతో పోలీసు అధికారుల సంఘానికి పొడుచుకొచ్చేసింది. 'బానిసత్వం' అన్న మాటపై పోలీసు శాఖకి పౌరుషం రావడం తప్పు లేదు కానీ, అన్ని విషయాల్లోనూ పోలీసు అధికారుల సంఘం స్పందన ఇలాగే వుండాలి కదా. ఇంతకీ, అధికార పార్టీ నేతలు పోలీసులపై విరుచుకుపడ్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు.? అన్న రోజా ప్రశ్నకు పోలీసు అధికారుల సంఘం ఏం సమాధానం చెబుతుందట.! Readmore!

Show comments