సాక్షీ.. నీకు సలాం

ఒలింపిక్స్‌లో అమెరికా దూసుకెళ్తోంది.. చైనా సంగతి సరే సరి.. చిన్న చిన్న దేశాలూ సంచలనాలు సృష్టిస్తున్నాయి. కానీ, మనమెక్కడ.? అసలు ఒలింపిక్స్‌లో మన జాడేదీ.? దేశమంతా ఒలింపిక్స్‌ విషయంలో నిరాశా నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్న సమయంలో అనూహ్య సంచలనం. మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ అనూహ్యంగా పతకం సాధించింది. 

పతకం చేజారిపోయిన తరుణంలో అనూహ్యంగానే సాక్షి మాలిక్‌కి 'రెప్‌ఛేజ్‌' ద్వారా ఛాన్స్‌ దొరికింది. ఈసారి ఛాన్స్‌ వదులుకోలేదు. పతకం సాధించింది. ఇదే తరహాలో భారత రెజ్లర్లు గతంలో రెండు పథకాల్ని సాధించిన సందర్భాలున్నాయి. ఎలాగైతేనేం, గెలుపు గెలుపే. అందులోనూ ఈ గెలుపు మరీ ప్రత్యేకం. అందుకే, దేశమంతా ఇప్పుడు సాక్షికి సలాం అంటోంది. హరియాణా ప్రభుత్వం, సాక్షి మాలిక్‌కి 2.5 కోట్ల రూపాయల నజరానా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించేసింది. 

భారత ప్రభుత్వం తరఫున కూడా సాక్షి మాలిక్‌కి అరుదైన గౌరవం దక్కనుంది. భారీ నజరానా ప్రకటించేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తోంది. మరోపక్క, దేశంలోని వివిధ రాష్ట్రాలు సాక్షి మాలిక్‌ని ప్రత్యేకంగా సన్మానించేందు సన్నాహలు చేస్తుండడం గమనార్హం. 12 ఏళ్ళ తన కష్టం.. ఈ రోజు ఇలా పతకం సాధించి పెట్టిందని సాక్షి మాలిక్‌ ఉద్వేగంగా చెబుతోంటే, పతకాల పట్టికలో ఎక్కడో వున్నా సరే, భారత్‌ని పతకాల పట్టికలో నిలబెట్టిన సాక్షికి సెల్యూట్‌ చెయ్యకుండా వుండగలమా.? 

'ఒలింపిక్స్‌లో భారత ప్రాతినిథ్యమే శుద్ధ దండగ..' అని శోభా డే వెటకారం చేస్తే, సోషల్‌ మీడియా, ఇప్పుడామెకు 'ఇదిగో పతకం..' అంటూ సాక్షి మాలిక్‌ని చూపిస్తున్నారు. 'శోభా డేకి భలేగా చెంపదెబ్బ కొట్టావ్‌ సాక్షీ..' అంటూ సోషల్‌ మీడియాలో సాక్షి మాలిక్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు నెటిజన్లు. 'సెల్ఫీలు తీసుకోడానికే వెళుతున్నారు.. ఆట మీద వారికేమాత్రం ఇంట్రెస్ట్‌ లేదు..' అంటూ శోభా డే నోరు పారేసుకున్న విషయం విదితమే.

Show comments