హీరో విక్రమ్ తమిళ సినిమాలతోనే తెలుగులో పాపులర్ అయ్యాడు. తెలుగులో చాలాకాలం క్రిందట స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేశాడనుకోండి.. అది వేరే విషయం. ప్రస్తుతం 'ఇంకొక్కడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విక్రమ్‌లో ఓ కోరిక ఎప్పటినుంచో బలంగా వుండిపోయిందట. అదేంటంటే, మెగాఫోన్ పట్టడం.
దర్శకత్వం వహించాలనే ఉద్దేశ్యంతో, చేసే ప్రతి సినిమానీ జాగ్రత్తగా పరిశీలిస్తాడట. సెట్స్‌లో హీరోగా తానేమివ్వగలనో అదిచ్చేసి, ఆ తర్వాత సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలకు చెందినవారితోనూ ఆయా విభాగాలకు సంబంధించిన విషయాల్ని అడిగి తెలుసుకుంటాడట విక్రమ్. ప్రతి సినిమా విషయంలోనూ ఇదో రొటీన్ వ్యవహారమేనని విక్రమ్ చెబుతుంటాడు.
ఇక, తాను దర్శకత్వం వహించే సినిమాలో విక్రమ్ హీరోగా నటించడట. ఆ ఛాన్స్ ఇంకో హీరోకి ఇస్తానంటున్నాడు. అదేంటలా.? అంటే, అది అదనపు బాధ్యత అవుతుందని విక్రమ్ చెబుతున్నాడు. అయితే, దర్శకత్వం వహించానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెబుతున్న విక్రమ్, ప్రస్తుతానికైతే హీరోగానే సినిమాల్లో బిజీగా వున్నానని చెప్పుకొచ్చాడు.
ఇదిలా వుంటే, 'మల్లన్న' తదితర చిత్రాలకి విక్రమ్ విలువైన ఇన్‌పుట్స్‌నిచ్చాడట. సాంకేతిక పరంగానూ విక్రమ్ తనకున్న అవగాహనతో, ఆయా సినిమాల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాడనే ప్రచారం అప్పట్లో జరిగింది. 'ఐ' సినిమా విషయంలో అలాంటి ఇన్‌పుట్స్ ఏమీ ఇవ్వకపోయినా, శంకర్ నుంచి విక్రమ్ చాలా పాఠాలే నేర్చుకున్నాడట సినిమాకి సంబంధించి.