50 వేలు చెల్లిస్తే చాలు.. అప్పనంగా డబ్బులు సంపాదించేయొచ్చు...
- మల్టీలెవల్ మార్కెటింగ్ కొత్త టెక్నిక్ ఇది.
సామాన్యులు వేలు, లక్షలు కోల్పోయారు. అలా అందర్నీ మోసగించినోడేమో, 3700 కోట్ల రూపాయల్ని వెనకేసుకున్నాడు. చివరికి ఇది పెద్ద 'స్కామ్' అనీ, 'చీటింగ్' అనీ తేలినా, పోలీసులు ధృవీకరించినా, 'మాస్టర్ మైండ్'ని అరెస్ట్ చేసినా, 'అబ్బే.. అదంతా ఉత్తదే.. ఇది జెన్యూన్.. నిఖార్సుగా మా డబ్బులు మాకొచ్చేశాయ్ కదా.. పైగా, ఇదేమీ మల్టీలెవల్ మార్కెటింగ్ కాదు.. ఇదొక ఉద్యోగం లాంటిది..' అని బుకాయించేవాళ్ళని ఇంకా చూస్తూనే వున్నాం.
జస్ట్, 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్.. ఇది ఫ్రీడమ్ ఆఫర్..
- మొన్నామధ్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది ఓ సంస్థ.
ఎడా పెడా ఆన్‌లైన్ బుకింగులు షురూ అయ్యాయి. 'అప్పనంగా వచ్చేస్తోంటే, ఎవరు మాత్రం వద్దనుకుంటారు.. జస్ట్, ఓ సినిమా చూశామనుకుందాం..' అంటూ బుక్ చేసేశారు. తీరా, ఆ మాయగాడు జస్ట్ 8వ తరగతి కూడా పాస్ అవకుండానే, ఓ కంపెనీ స్థాపించేసి, జనాన్ని మోసగించేశాడు.
మొదటి సందర్భంలో చదువుకున్న వ్యక్తే.. దేశ ప్రజానీకాన్ని మోసం చేశాడు. రెండో ఘటనలో, చదువూ సంధ్యా లేని ఓ వ్యక్తి జనాన్ని మోసం చేశాడు. చిత్రంగా, ఈ మోసాలకు బలైపోయినవారిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్స్.. ఇంకా ఇంకా ఉన్నత స్థానాల్లోనివారూ వున్నారు. దీనర్థమేంటి.? మోసం చేయడానికి చదువే అవసరం లేదని. జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చెయ్యాలంటే, ఏదో ఒక 'మాయ' చెయ్యాలి. ఆ మాయ చెయ్యగలిగితే, ఎవడ్నయినాసరే బురిడీ కొట్టించేయొచ్చు.
'మేం మేధావులం..' అనుకున్నవాళ్ళే ఎక్కువగా ఇలాంటి సందర్భాల్లో పిల్లిమొగ్గలేసేస్తుంటారు. ఎవరన్నా చెప్పినా వినరు. అదే అసలు సమస్య. 251 రూపాయలకే ఫోన్.. అనగానే పరిగెత్తేముందు ఒకసారి 'అది సాధ్యమా.?' అని ఆలోచిస్తే, అసలు ఈ సమస్యే వచ్చేది కాదు. 50 వేలు చెల్లించి, ఇంకో ముగ్గుర్ని మోసం చేయడమంటే, ముందు తామూ మోసపోతున్నామని అనుకుని వుంటే, 3700 కోట్లు కొల్లగొట్టేందుకు ఒకడికి మనం అవకాశమిచ్చేవాళ్ళమే కాదు.
డబ్బెవరికి చేదు.? అప్పనంగా వస్తోందంటే.. ఇదిగో ఇలాగే విజ్ఞత కోల్పోతారు. మేధావులు సైతం మూర్ఖులైపోతారంతే.