చిన్నమ్మ బహిష్కరణ: తమిళనాడులో అంతే.!

అసలు శశికళని చిన్నమ్మగా గౌరవించడమేంటి.? పార్టీ పగ్గాలప్పగించడమేంటి.? ముఖ్యమంత్రిని చేసెయ్యడమేంటి.? ఏంటీ, చెత్త రాజకీయం.? ఇలా సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి జయలలిత మరణానంతరం. ఎందుకంటే, జయలలితకు శశికళ కేవలం స్నేహితురాలు మాత్రమే. పార్టీకి సంబంధించినంతవరకు, ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఎప్పుడూ జయలలిత, శశికళను దగ్గరకు రానివ్వలేదు. అలాంటిది, జయలలిత ఆసుపత్రి పాలయ్యాక మొత్తం సీన్‌ మారిపోయింది. అన్నాడీఎంకే పార్టీలో శశికళ పవర్‌ సెంటర్‌ అయిపోయారు. కానీ, అనూహ్యంగా అక్రమాస్తుల కేసు, ముఖ్యమంత్రి అవ్వాలన్న శశికళ ఆశలపై నీళ్ళు చల్లేసింది. 

'నన్ను జైలుకు పంపినవారి అంతు చూస్తాను.. పన్నీర్‌ సెల్వం సంగతి చూస్తాను.. ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాను..' అంటూ జయలలిత సమాధిపై 'బాదుడు' బాదేసి మరీ, శపథం చేసేశారు శశికళ. ఇప్పుడేమయ్యింది.? అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ బహిష్కరణకు గురయ్యారు. శశికళతోపాటు, దినకరన్‌నీ పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలో, అన్నాడీఎంకే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇదంతా తిరుగుబాటు నేత పన్నీర్‌ సెల్వం కోరిక. ఆయన కోరుకున్నట్లుగానే అంతా జరుగుతోంది. శశికళను వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చిన పన్నీర్‌ సెల్వం ఏం చేయగలడులే.. అనుకున్నారంతా. కానీ, ఆయన చెయ్యాలనుకున్నది చేసేశాడు. శశికళను ముఖ్యమంత్రి కానివ్వబోనని శపథం చేశాడు, మాట నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం శశికళ జైల్లో వున్నారు. పార్టీ అధినేత్రిగా నిన్న మొన్నటిదాకా ఆమె పట్ల కొందరైనా సాఫ్ట్‌ కార్నర్‌తో వున్నారేమో. ఇక నుంచి అదేమీ వుండదు. రాజకీయంగా ఇప్పుడామె అనాధ అయిపోయారు. ఇంకో మూడేళ్ళకు పైనే ఆమె జైలు శిక్ష అనుభవించాల్సి వుంది. 

సో, చిన్నమ్మ రాజకీయ జీవితానికి శాశ్వతంగా సమాధి కట్టేసినట్లే. కొన్నాళ్ళ క్రితం ఆమె పార్టీ అధినేత్రి, ఆ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి, చివరికి జైలు పక్షి. ఈవిడకేనా, పార్టీ మొత్తం మద్దతిచ్చింది.? ఈవిడకేనా ఎమ్మెల్యేలు, మంత్రులు సాష్టాంగపడి నమస్కారం చేసింది.? ఈవిడేనా శపథాలు చేసేసింది.? ఈవిడేనా ఈ రోజు అనామకురాలైపోయింది.? తమిళనాడులో అంతే.!

Show comments