మిథున్‌ రెడ్డి.. ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడా?

రెండు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల కలయికగా ఉంటుంది రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం. కడప జిల్లా, చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని నియోజకవర్గాల కలబోతగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించాడు పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన మిథున్‌ రెడ్డి వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి సన్నిహితుడనే పేరుంది. వీరి స్నేహం ఇప్పటిది కాదని, జగన్‌ రాజకీయాల్లో క్రియాశీలం కాకముందు నుంచే వీరు సన్నిహితులని పేరు.

వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్‌ల మధ్య అంత సాన్నిహిత్యం ఏమీ ఉండేది కాదు. వైఎస్‌ కేబినెట్‌లో మంత్రే అయినా.. పెద్దిరెడ్డి పోకడ  కొంచెం భిన్నం. వీరిద్దరికి భిన్నంగా.. జగన్‌, మిథున్‌లు సన్నిహితులయ్యారు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతానికి ఎంపీగా ఉన్న మిథున్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే భావనతో ఉన్నట్టు సమాచారం. ఎందుకలా అంటే.. రాష్ట్ర రాజకీయాల్లో మరింత క్రియాశీలం అయ్యేందుకు అని చెప్పవచ్చు. మరో రకంగా చూడాలంటే.. రేపటి ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తే మంత్రివర్గం విషయంలో తన టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి మిథున్‌ను ఎమ్మెల్యేగా నిలపాలనేది జగన్‌ భావనగా తెలుస్తోంది.

జగన్‌ పార్టీ అధికారంలోకి వచ్చి.. రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. అయితే వైఎస్‌ దగ్గర మంత్రిగా చేసిన వ్యక్తికి జగన్‌ వద్ద చేయడానికి కొంత ఇబ్బంది తప్పదు. అందుకే.. మిథున్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చి, రామచంద్రారెడ్డిని ఎంపీగా పంపే ఫార్ములాను ఇప్పటికే రెడీ చేసుకున్నట్టు సమాచారం. విశేషం ఏమిటంటే.. రామచంద్రారెడ్డిని రాజంపేట ఎంపీగా పోటీ చేయించినా, మిథున్‌ను మాత్రం పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం లేదని తెలుస్తోంది.

పుంగనూరులో ఎలాగూ వైకాపాను గెలిపించుకోవచ్చు.. మిథున్‌ను పలమనేరు నుంచి పోటీ చేయించే ప్లాన్‌ ఉందని తెలుస్తోంది. ఇటీవలే పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలుగుదేశంలో చేరిపోయాడు. ఈ నియోజకవర్గంలో అమర్‌ చాలా సీనియర్‌. ఆయనను ఎదుర్కొనడానికి మిథున్‌ అయితే సరిపోతాడని, ఈ నియోజకవర్గంపై పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మంచి పట్టు ఉందని.. దీంతో మిథున్‌ రెడ్డి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.

Show comments