జగన్‌ లేని లోటు కన్పిస్తోంది

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌, వ్యక్తిగత పర్యటనలో బాగంగా విదేశాలకు వెళ్ళిన విషయం విదితమే. ఈ తరుణంలో పార్టీ కార్యక్రమాల్ని చక్కబెట్టడం పార్టీ ముఖ్య నేతలకు కష్టంగానే మారింది. చెప్పుకోడానికైతే చాలా చాలా పొలిటికల్‌ డెవలప్‌మెంట్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. అంతెందుకు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మొన్నటి ఎన్నికల్లో 11.5 కోట్లు ఖర్చు చేశానన్న మాట ఎంత సీరియస్‌ అంశం.? దాన్ని పట్టుకుని వైఎస్సార్సీపీ మేగ్జిమమ్‌ పొలిటికల్‌ హడావిడి చేయడానికి వీలుంది. కానీ, ఆ స్థాయిలో వైఎస్సార్సీపీ నుంచి మూమెంట్‌ లేకుండా పోయింది. 

రాజధాని విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు గడచిన నాలుగైదు రోజుల్లో చాలా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసేసుకున్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ప్రతిపక్షం మండిపడ్తున్నా, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందిస్తే, ఆ తర్వాత మిగతా నేతల స్పందనకు ఇంకాస్త పవర్‌ వుండి వుండేదే. ఒకరిద్దరు నేతలు చేస్తున్న హడావిడి, వైఎస్సార్సీపీ కింది స్థాయి నేతలు, కార్యకర్తల్లో ఏమాత్రం ఉత్సాహం నింపలేకపోతోంది. 

ప్రధానంగా ప్రస్తుతానికి కోడెల ఎపిసోడ్‌, స్విస్‌ ఛాలెంజ్‌ ఎపిసోడ్‌ రాష్ట్రంలో హాట్‌ టాపిక్స్‌. రెండిటిలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్‌ ప్రతిపక్షానికి పూర్తిస్థాయిలో వుంది. చిత్రంగా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా సైలెంటయిపోయింది. సి.రామచంద్రయ్య తదితరులు మాట్లాడినా, వారి మాటలకు విలువ లేకుండా పోయింది. ఎలాగూ మీడియా మొత్తం తన చేతుల్లోనే వుంది గనుక, చంద్రబాబు తాను చెయ్యాలనుకున్న పనులు పూర్తి చేసేసుకుని, ఎంచక్కా చైనా టూర్‌కి బయల్దేరిపోయారు. ఈలోగా మీడియా, చంద్రబాబుని ఏ రేంజ్‌లో మోసెయ్యాలో ఆ రేంజ్‌లో మోసేసింది. అంతే తప్ప, స్విస్‌ ఛాలెంజ్‌ అనీ, ఇంకోటనీ రాజధాని పేరుతో చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్‌ గేమ్‌ విషయంలో మాత్రం ఎవరూ తప్పు పట్టలేని పరిస్థితి. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని సింగపూర్‌కి దాదాపుగా రాసిచ్చేస్తున్నారు చంద్రబాబు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత అందుబాటులో లేకపోవడం ఖచ్చితంగా అధికార పార్టీకి కలిసొచ్చే అంశమే. వైఎస్‌ జగన్‌ తిరిగొచ్చి, ఎంత హడావిడి చేసినా.. అప్పటికి వ్యవహారం పాతబడిపోకుండా వుంటుందా.?

Show comments