చిరంజీవి అంటే డాన్సింగ్ సెన్సేషన్ ఒకప్పుడు. సినిమా సినిమాకీ డాన్సుల్లో జోష్ పెంచుతూ వచ్చిన చిరంజీవి, అప్పట్లో యావత్ భారతీయ సినీ పరిశ్రమకే డాన్సుల పరంగా మొనగాడనిపించుకున్న విషయం విదితమే. అయితే, 'ఠాగూర్' తర్వాత చిరంజీవి డాన్సుల్లో జోష్ తగ్గింది. 'స్టాలిన్', 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమాల్లో చిరంజీవి మమ అన్పించేశారు. కానీ, చిరంజీవి ఇమేజ్ ముందు.. ఆ డాన్సుల్లో తగ్గిన జోష్ పెద్దగా లెక్కల్లోకి రాలేదు.
ఇప్పుడు సీన్ మారింది. దాదాపు ఎనిమిదేళ్ళకుపైనే అయ్యింది చిరంజీవి సినిమాల్లో డాన్సులు వేసి. మొన్నీమధ్యనే సినీ 'మా' అవార్డ్స్ వేడుకలో చిరంజీవి స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చినా, తెరపై డాన్సుల్లో చిరంజీవి ఏ రేంజ్‌లో 'జోష్' చూపిస్తారు.? అన్నదానిపై సవాలక్ష అనుమానాలున్నాయి. 'చిరంజీవిలో జోష్ తగ్గలేదు.. ఆయన డాన్సుల్లో ఈజ్ తగ్గలేదు..' అని చెప్పుకోవడం వరకూ బాగానే వుంటుందిగానీ, తమ అంచనాలకు తగ్గట్టుగా తమ అభిమాన హీరో చిరంజీవి డాన్సులు వేయకపోతే అభిమానులు డీలాపడిపోరూ.?
ఇదే ఇప్పుడు చిరంజీవినీ వేధిస్తున్న అంవం. తెలుగు తెరపై ఈ తరం హీరోలంతా డాన్సులతో అదరగొట్టేస్తున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులే కాదు, రామ్ సహా పలువురు యంగ్ హీరోలు డాన్సుల్లో సత్తా చాటేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచే వచ్చిన సాయిధరమ్ తేజ డాన్సుల్లో చిరంజీవిని తలపించేస్తున్నాడు. కమెడియన్ సునీల్ కూడా డాన్సులతో అలరించేస్తునప్పుడు, చిరంజీవి డాన్సులంటే వెరీ వెరీ స్పెషల్‌గా వుండాలి కదా.?
చిరంజీవి డాన్సులకు ఒకప్పుడు ప్రభుదేవా వన్నెలద్దితే, ఆ తర్వాతి కాలంలో లారెన్స్, చిరంజీవితో బీభత్సమైన స్టెప్పులేయించాడు. ఇప్పుడు వీరిద్దరూ కొరియోగ్రఫీ చాలావరకు తగ్గించేశారు. మరి, చిరంజీవి కోసం వాళ్ళంతా తిరిగొస్తారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఏదిఏమైనా, చిరంజీవికి ఇప్పుడు మెగా టాస్క్ అంటూ ఏదన్నా వుందంటే అది డాన్సింగ్ వింగ్‌లోనే. చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమాలో చేయబోయే డాన్సుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారో.