భావ వ్యక్తీకరణ లోపం..అందుకే నవ్వులపాలు...!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పితాని సత్యనారాయణకు కోపం వచ్చింది. ఎవరి మీద? మీడియా మీద. ప్రధానంగా టీవీ ఛానెళ్ల మీద. ఎందుకు? మంత్రి కమ్‌ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ తప్పులతడకల తెలుగు ఉపన్యాసాలను, భాషా దోషాలను ఎత్తి చూపుతున్నందుకు. ప్రింట్‌ మీడియాతో ఇబ్బంది లేదని, ఎలక్ట్రానిక్‌ మీడియాతోనే ఇబ్బందిగా, చికాకుగా ఉందన్నారు. నిజమే. రాజకీయ నాయకులకు టీవీ ఛానెళ్లు ఇబ్బందికరమే. అవి ఒక ఘటనను లేదా సందర్భాన్ని పట్టుకుంటే ఓ పట్టాన వదిలిపెట్టవు. అదేఅదే పదేపదే ప్రసారం చేస్తుంటాయి. ఇక వివాదాస్పద అంశాలైతే ఛానెళ్లకు పండగే. దాన్ని పదేపదే ప్రసారం చేయడమే కాకుండా నలుగురిని పోగేసి చర్చా కార్యక్రమాలు కూడా పెడతాయి. పితాని సాక్షి టీవీని దృష్టిలో పెట్టుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు మాట్లాడటం సహజమని, వాటిని పదేపదే ప్రసారం చేయడం రేటింగులు పెంచుకోవడానికేనని విమర్శించారు. ఇందులోనూ అవాస్తవం లేదు. అన్ని ఛానెళ్లు ఇదే పనిచేస్తున్నాయి. లోకేష్‌ తోటి మంత్రే కాకుండా అధినేత కుమారుడు కాబట్టి పితాని అతన్ని సమర్ధించడం తప్పు కాదు. కాని పార్టీ, ప్రభుత్వం పరువు పోయేలా మాట్లాడుతుంటే ఎన్నాళ్లు సమర్థిస్తారు?

పితాని దృష్టిలో లోకేష్‌ చేసినవి చిన్న తప్పులు. లోకేష్‌ పార్టీలో, ప్రభుత్వంలో లేకుండా హెరిటేజ్‌లో ఉన్నట్లయితే అవి చిన్న తప్పులే. ఎవ్వరూ పట్టించుకోరు. కాని అతను ఇప్పుడు ప్రజానాయకుడు. బాధ్యత గల మంత్రి. పార్టీలోనూ పెద్ద పదవిలో ఉన్నాడు. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేస్తున్నారు. ఇంత గొప్ప వ్యక్తి తప్పులు మాట్లాడితే పరువు పోదా? భాషా దోషాలు వేరు. భావ వ్యక్తీకరణ వేరు. లోకేష్‌లో భాషా దోషాలున్నాయి. భావ వ్యక్తీకరణ లోపమూ ఉంది. ఈ రోజుల్లో తెలుగులో భాషా దోషాలను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. లోకేష్‌ను విమర్శిస్తూ వార్తలు చదివే న్యూస్‌రీడర్లకు, యాంకర్లకే తెలుగు సరిగా రాదు. టీవీ ఛానెళ్లలో పనిచేస్తున్న చాలామంది న్యూస్‌ రీడర్లకు, యాంకర్లకు 'ఒత్తులు' పలకవు. తడబాట్లూ ఎక్కువే. ఇక తెలుగు ఛానెళ్ల రిపోర్టర్ల విషయం చెప్పనే అక్కర్లేదు. ఒక్కరిలో స్పష్టత ఉండదు. సూటిగా మాట్లాడలేరు. వీరు ఎప్పుడు తెర మీది నుంచి పోతార్రా బాబూ అనిపిస్తుంది. భాష విషయంలో లోకేష్‌ వీళ్ల కంటే భిన్నం కాదు. 

అందులోనూ చిన్నప్పటినుంచి ఇంగ్లిషు మీడియం చదువు కాబట్టి తెలుగు మాట్లాడటమే కాదు, రాయడమూ రాదు. లోకేష్‌కు 'రాత లోపం' కూడా ఉందేమో తెలియదు. చిన్నప్పటినుంచి ఇంగ్లిషు మీడియంలో చదువుకున్నవారికి (తెలుగు మీడియంలో చదివిన నేతలూ అధ్వానమే) భావ వ్యక్తీకరణ లోపం ఉంటుంది. తాము ఏం చెప్పాలనుకున్నారో దాన్ని మాతృ భాషలో సరిగా చెప్పలేరు. అలా చెప్పే క్రమంలో అర్థాలు మారిపోతాయి. ఒకటి చెప్పాలనుకొని మరొకటి చెబుతారు. లోకేష్‌కు మూడు నాలుగు సందర్భాల్లో జరిగింది ఇదే. అంబేద్కర్‌ జయంతిని వర్థంతని చెప్పాడంటే ఆ రెండు పదాలకు ఉన్న తేడా తెలియదనుకోవాలి లేదా సమాచారం సరిగ్గా తెలుసుకోలేదనుకోవాలి. భావ వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌) సరిగా లేకపోతే నవ్వులపాలవుతామనే విషయం లోకేష్‌ ఇప్పటికైనా గ్రహించాడో లేదో...! ఆ లోపాన్ని అతను తప్పనిసరిగా సరిచేసుకోవాలి. ఉపన్యాస కళ నేర్చుకోవాలి. ఇందుకు శిక్షకులున్నారు. వారి సహాయం తీసుకోవాలి. తాను మంత్రిని కాబట్టి శిక్షణ తీసుకోవడమేమిటని అతను అహంకరిస్తే మరింత నవ్వులపాలు కావల్సివస్తుంది. ఇంగ్లిషు, హిందీ రానివారు క్లాసులకెళ్లి ఆ భాషలు నేర్చుకుంటారు. తెలుగులో ఉపన్యసించడం కూడా అలా నేర్చుకోవాలి.

చంద్రబాబు మంచి వక్త కాదు. కాని భావ వ్యక్తీకరణ లోపం లేదు. పవన్‌ కళ్యాన్‌ మంచి నటుడే కాని మంచి ఉపన్యాసకుడు కాదని తేలిపోయింది. చిరంజీవి ప్రసంగాలు పేలవంగా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదని, జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతంగా ప్రసంగించి, ఉర్రూతలూగించగలడని ఓ సారి మీడియా విశ్లేషించింది. టీడీపీ వ్యవస్థాపకడు ఎన్టీఆర్‌ ప్రసంగాల గురించి జనం ఇప్పటికీ చెప్పుకుంటారు. ప్రజలను ఆయన ఉర్రూతలూగించినట్లు ఎవ్వరూ ఊగించలేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మంచి వక్తగా అంతర్జాతీయంగా పాపులర్‌ అయ్యారు. కేసీఆర్‌ ప్రజల భాషలో, యాసలో ఎదురుగా కూర్చుని ముచ్చట పెడుతున్నట్లే మాట్లాడతారు. కేటీఆర్‌, కవితకు వచ్చిన ప్రధాన వారసత్వం 'మాటకారితనం'. ఇద్దరూ మంచి ఉపన్యాసకులు. పార్లమెంటులో కవిత ఉపన్యాసాలకు ఎల్‌కే అద్వానీ వంటి సీనియర్‌ నాయకులు ముగ్ధులయ్యారు. ఇలా చెప్పుకుంటే చాలా ఉదాహరణలున్నాయి. మంత్రి పితాని మీడియా మీద ఎగిరిపడకుండా మంచి ఉపన్యాసకుడు కావల్సిందిగా లోకేష్‌కు సలహా ఇవ్వడం మంచిది.

Show comments