సీరియస్ గా: వస్తే గిస్తే మీకే రావాలి బాబూ ‘నోబెల్’!

ఇంత వరకూ ఒలింపిక్స్ లో పథకం సాధిస్తే కోట్ల రూపాయల బహుమతి ఇస్తాం, క్రికెట్ లో వరల్డ్ కప్ సాధిస్తే.. కిరీటాలు పెడతాం.. అని మన పాలకులు ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగింది కానీ, ‘నోబెల్’ సాధించండి, వంద కోట్లు గెలవండి.. అంటూ ఆఫర్ ఇచ్చిన పాలకుడు ఎవరూ లేకపోవచ్చు! ఏదేమైనా చంద్రబాబు ప్రత్యేకమైన ‘నేత’, ఆయన ‘విజన్’ వేరే.. అందుకే అందరూ సాదాసీదా ఘనతలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాబు మాత్రం ఏకంగా ‘నోబెల్’ కు టెండరేశారు!

మరి ‘తెలుగు బిడ్డ’ అంటూ చెప్పారు కాబట్టి.. తెలంగాణను కూడా కలుపుకున్నట్టే! ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైనా నోబెల్ సాధించిన బాబుగారి బంపర్ ప్రైజ్ వారికి అందుతుంది! మరి ఇక రెచ్చిపోవడమే.. పదండి ముందుకు, పదండి తోసుకు.. నోబెల్ సాధించేందుకు అని!

అయితే.. నోబెల్ అంటే మనకు అందని ద్రాక్షే! అతి తక్కువ మంది భారతీయులు మాత్రమే దీన్ని సాధించారు. అలాగే నోబెల్ కమిటీ భారత్ పట్ల కొంత వివక్ష పాటిస్తుందని కూడా అంటారు. మహాత్మగాంధీకి నోబెల్- పీస్ ప్రైజ్ ప్రకటించకపోవడమే దానికి నిదర్శనం అంటారు. ఆ గొడవంతా వేరే!
మరి ఇప్పుడు తెలుగునాట నోబెల్ బహుమతి సాధించేటంతటి ప్రజ్ఞావంతుడు ఎవరైనా ఉన్నారా? అని తరచి చూస్తే ఎవ్వరూ కనిపించకపోవచ్చు. ఏ కైలాష్ సత్యార్థిలాగానో.. అండర్ డాగ్ గా వచ్చి నోబెల్ సాధిస్తే తప్ప, ‘రేసు’ లో మాత్రం ఎవ్వరూ కనిపించట్లా. ప్రత్యేకించి లివింగ్ లెజెండ్స్ లో వెలుగులో ఉన్న వారెవరూ కనిపించడంలా.. ఒక్క చంద్రబాబు తప్ప!

ఔను.. ఇప్పటికిప్పుడు తెలుగునాట నోబెల్ అందుకోవాలంటే, దానికి అర్హత బహుశా చంద్రన్నకే ఉందేమో! నోబెల్ కమిటీ ఈ విషయాన్ని పరిశీలించి చూడాలి! ఎందుకంటే.. బాబు ప్రజ్ఞ ఒక్క రంగంలో కాదాయె! శాస్త్రసాంకేతిక రసాయన భౌతిక శాంతి.. ఈ ఏ విభాగంలో అయినా బాబు బహుముఖ ప్రజ్ఞ ఆయన మాటల్లోనే తరచూ వ్యక్తం అవుతూ ఉంటుంది!

భారత దేశానికి సెల్ ఫోన్ ను పరిచయం చేసింది ఆయనే, ఐటీని పరిచయం చేసింది, ఐటీ అభివృద్ధి ఆలోచన ఆయనదే, ఇంటర్నెట్ వినియోగం ఇంత విస్తృతం కావడానికి కారణం ఆయనే, దేశంలో నేషనల్ హైవేలు డెవలప్ కావడానికి కారణం ఆయనే, ఒక సత్యా నాదెళ్ల తయారయ్యాడంటే దానికి కారణం ఆయనే.. పీవీ సింధుకూ ఒలింపిక్స్ లో పతకం వచ్చిందంటే దానికీ కారణం ఆయనే, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది ఆయనే… ఇంకా ఇంకా.. చెప్పుకొంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి ఇలాంటివన్నీ! అవన్నీ సంభవించడానికి కారణం తనే అని బాబు గారు ఇప్పటి వరకూ కొన్ని వందల సార్లు చెప్పుకుని ఉంటారు! బహుశా వేల సార్లేమో!

మరి ఇప్పుడు చెప్పండి.. ఇన్నీ ఘనతలు సాధించిన వ్యక్తి ఈ భూ పెపంచికం మీద ఎక్కడైనా ఉంటాడా? తెలుగునాటే కాదు.. ప్రపంచంలో ఇలాంటి మూల పురుషుడు ఎవ్వరైనా ఉన్నారా? అంటే, లేరు.. అని నొక్కి వక్కాణించవచ్చు. ఇన్ని సాధించానని చెప్పుకునే దమ్మున్న శాస్త్రవేత్త కానీ, నేత కాని, శాంతి ప్రబోధకుడు కానీ, దేశాధ్యక్షుడు కానీ లేరు! బాబు గారు మాత్రం అవన్నీ సాధించినందుకు తనకు ‘అదో తృప్తి..’ అని అనునిత్యం చెప్పుకొంటూ ఉంటారు! 

సో.. నోబెల్ కమిటీ ఈ విషయాలను గుర్తించాలి. ఒక రంగంలో కాదు.. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, పీస్.. ఇలా నోబెల్ ను ఏయే విభాగాల్లో ఇస్తారో, ఆ విభాగాలన్నింటిలోనూ బాబుకు నోబెల్ ఇచ్చేయాలి. ఏ ఒక్క విభాగంలో తక్కువైనా ఒప్పుకునేది లేదు. ఇచ్చేయాలంతే! అప్పుడే ‘నోబెల్’ కు కూడా అదో తుత్తి!

Show comments