విన్నారా ఈ వింత.? తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ఓ సినిమా రూపొందనుంది. అది కూడా, చంద్రబాబు రెండేళ్ళ పాలన (13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా) తాలూకు గొప్పలు చెప్పుకోడానికి ఈ సినిమాని తెరకెక్కిస్తుండడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ హోమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆగస్ట్ 4న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఒంగోలులో ఘనంగా జరుగుతుందట. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. విజయవాడ కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ ఈ చిత్రానికి దర్శకుడు.
అదిరింది కదూ.. చంద్రబాబు పొలిటికల్ స్టంట్.! రెండేళ్ళలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏం సాధించారు.? ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది.? అన్న విషయాల్ని పక్కన పెడితే, పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని 'పబ్లిసిటీ కోసం' దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు, అది చాలదన్నట్లు.. మళ్ళీ ఇదిగో, ఇలా సినిమాలతో హల్‌చల్ చేస్తున్నారు.
ఇంతకీ, కాల్ మనీ సెక్స్ రాకెట్, అమరావతి భూ కుంభకోణం, పార్టీ ఫిరాయింపులు.. ఇలాంటి అంశాల చుట్టూ కూడా సినిమాలో చర్చ జరుగుతుందేమో. కాల్ మనీ సెక్స్ రాకెట్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకపోతుందనడానికి నిదర్శనం. రాజ్యాంగంలో నైతిక విలువలకు పార్టీ పిరాయింపులే నిదర్శనం.. అమరావతి అభివృద్ధి చెందిందనడానికి భూ కుంభకోణమే నిదర్శనం.. అని చంద్రబాబు పాత్రతో చెప్పిస్తారా.? వేచి చూడాల్సిందే.
కొసమెరుపు: ఈ సినిమా కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమవుతుందా? తెలంగాణలో కూడా విడుదల చేస్తారా? ఏమో మరి, చంద్రబాబుకే తెలియాలి.