సింధుకి 'చంద్ర' నజరానా.!

బ్యాడ్మింటన్‌ సంచలనం, ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, మన తెలుగు తేజం పీవీ సింధుకి మూడు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు, చంద్రబాబు సర్కార్‌, సింధు కోచ్‌ గోపీచంద్‌కి 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇంకా కథ చాలానే వుంది, గోపీచంద్‌ కోసం 5 ఎకరాల భూమిని, అకాడమీ అవసరాలకు కేటాయించనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని తీసుకొచ్చిన భారత మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌కి కూడా 50 లక్షలు నజరానా ఇవ్వాలని ఏపీ క్యాబినెట్‌ తీర్మానించింది. 

తెలంగాణ ప్రభుత్వం, సింధుకి కోటి రూపాయల నజరానా ప్రకటించగా, చంద్రబాబు రెండడుగులు ముందుకేసి, తన 'గొప్ప'ని చాటుకున్నారు.. సింధుకి మూడు కోట్ల రూపాయల నజరానా ప్రకటించడం ద్వారా. ఇది కాస్త, షాకింగ్‌ విషయమే. సింధు సాధించిన విజయం ముందు కోట్లు పెద్ద విషయమేమీ కాదుగానీ, చిన్న రాష్ట్రం.. పైగా ఆర్థిక లోటుతో వున్న రాష్ట్రం నుంచి ఈ స్థాయి 'వితరణ' ఎంతవరకు సబబు.? అన్న చర్చ జరగడం సబబే. పైగా, చంద్రబాబు పబ్లిసిటీ 'పైత్యం'లో ఇది కూడా భాగమే.. అన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. 

'గోపీచంద్‌ని ఉద్ధరించింది నేనే.. సింధు పతకాన్ని సాధించడానికి కారణం నేనే..' అని తొందరపడి ముందే 'కూత' పెట్టిన చంద్రబాబు, తన పైత్యం కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడంతో.. ఇదిగో, ఇలా భారీ నజరానాల్ని ప్రకటించారన్నమాట. భారీ సన్మాన కార్యక్రమాన్ని ప్లాన్‌ చేయడంతో, ఆ వేదికపైనుంచి సింధు, గోపీచంద్‌లతో పొగిడించుకోవాలన్న ఆదుర్దా కూడా చంద్రబాబులో స్పష్టంగా కన్పిస్తోంది. 

సింధుకి, గోపీచంద్‌కీ, సాక్షి మాలిక్‌కీ నజరానా ప్రకటించడం వరకూ బాగానే వుంది.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒలింపిక్‌ స్థాయి క్రీడాకారుల్ని తయారు చేసేందుకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఏమేం చర్యలు తీసుకుంటున్నట్లు.? ఆ దిశగా చర్యలేమైనా ప్రారంభిస్తే.. పతక విజేతల స్ఫూర్తితో కొత్త తరం క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తే.. అదే పతకాల్ని సాధించిన విజేతలకు ఘన సన్మానంగా భావించాల్సి వుంటుంది.

Show comments