తను తెలుగుదేశం అభిమానినే అని వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని.. తన చివరి రక్తం బొడ్డు ఉన్నంత వరకూ తను తెలుగుదేశం అభిమానిగానే ఉంటానని శోభనాద్రి స్పష్టం చేశాడు. ఈ పర్యాయం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు విధానాలను ఖండిస్తూ వస్తున్నాడీయన. గతంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా చేసిన వడ్డే ఇలా మాట్లాడుతుంటే సరికి.. బహుశా ఈయన తెలుగుదేశానికి దూరం అయ్యాడేమో అనుకున్నారంతా. అయితే అలాంటిదేమీ లేదని శోభనాద్రి క్లారిటీ ఇచ్చాడు.
తను తెలుగుదేశం అభిమానినే అని స్పష్టం చేస్తూ.. చంద్రబాబు విధానాలను తీవ్రంగా తప్పు పట్టాడు ఈయన. ప్రస్తుతం ఒక రైతు సంఘం నేతగా ఆయన స్పందించాడు. రైతుల భూములతో బాబు వ్యాపారం చేస్తూ విదేశి ఖాతాలకు నిధులు మళ్లిస్తే సహించేది లేదని ఈయన స్పష్టం చేశారు. ఇది వరకూ రాజధాని భూముల వ్యవహారంలో బాబు తీరును ఎండగట్టిన శోభనాద్రి బందరు పోర్టుకు భూ సేకరణ అంశాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టాడు.
ఈ విషయంలో ఆయన చెప్పిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు సింగపూర్, రష్యా అంటూ తిరుగుతున్న బాబు అక్కడ పోర్టులన చూసి రాలేదా? అని శోభనాద్రి ప్రశ్నించారు. సింగపూర్ పోర్టు కేవలం 1,500 ఎకరాల్లో ఉంటుందని.. పోర్టు నిర్మాణానికి అంత భూమి సరిపోతుందని బాబుకు ఆదర్శమైన దేశం చెబుతోందని, అయితే బాబు మాత్రం లక్షా ఐదు ఎకరాల భూమిని సేకరించడం ఏమిటి? అని శోభనాద్రి ప్రశ్నించాడు.
ఇప్పటికే ఏపీలో 13 పోర్టులు ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయడానికి ఏమైనా కృషి జరుగుతోందా? అయితే బందరు పోర్టు విషయంలో భూ సేకరణకు అంత ఉత్సాహం ఎందుకు? అని ఆయన ప్రశ్నించాడు. ఈ అంశాలపై నిలదీస్తున్న ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం కాదు.. కచ్చితమైన సమాధానం ఇవ్వాలి అని శోభనాద్రి డిమాండ్ చేశాడు.
మరి శంకువులో పోస్తే తప్ప తీర్థం కాదు.. బాబు విధానాలను, అవినీతిని వైకాపా వాళ్లో, వేరే వాళ్లో ప్రశ్నిస్తే వాళ్లకు అర్హత లేదనే తెలుగుదేశం అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన సామాజికవర్గానికి చెందిన ప్రముఖుడు, తనకు ఇంకా తెలుగుదేశం సభ్యత్వం ఉంది, అది చచ్చే వరకూ ఉంటుంది.. అని చెప్పిన వ్యక్తి బాబు విధానాలను తీవ్రంగా తప్పుపడుతున్నాడు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని బాబు కించపరుస్తున్నాడు.. అని ఈయన ఆవేధన వ్యక్తం చేస్తున్నాడు. మరి దీనికేం సమాధానం చెబుతుందో పచ్చపార్టీ!