'కాటమరాయుడు' నవ్వులు - కండిషన్స్‌ అప్లయ్‌.!

పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' విడుదలకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ టీజర్‌ బయటకొచ్చేసింది.. యూ ట్యూబ్‌లో కోటి వ్యూస్‌ దాటేసింది 'కాటమరాయుడు' టీజర్‌. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ మూడు ఆడియో సింగిల్స్‌ కూడా విడుదల చేసేశారు. అవీ యూ ట్యూబ్‌లో హల్‌చల్‌ చేసేస్తున్నాయి. తాజాగా, 'కాటమరాయుడు' టీమ్‌ మరో వీడియో విడుదల చేసింది. ఇందులో 'కాటమరాయుడు' నవ్వుతూ తుళ్ళుతూ సందడి చేస్తున్నాడు. 

'అలీ పక్కనుంటే ఆ ఎనర్జీనే వేరు..' అని చాలా సందర్భాల్లో చెప్పిన పవన్‌, 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ స్పాట్‌లో అలీతో కలిసి ఓ రేంజ్‌లో కామెడీ పండించేశాడు. సినిమాలో ఈ స్థాయి కామెడీ వుంటుందో లేదోగానీ, మేకింగ్‌ వీడియో కోసం పవన్‌, అలీ నవ్విన నవ్వులు చూస్తే, ఈ తరహా మేకింగ్‌ వీడియో ఇప్పటిదాకా రాలేదని మాత్రం చెప్పొచ్చు. 

తమిళ సినిమా 'వీరం'కి 'కాటమరాయుడు' రీమేక్‌. తెలుగులో ఆల్రెడీ 'వీరం' సినిమా, 'వీరుడొక్కడే' పేరుతో డబ్‌ అయిపోయింది. మరి, 'కాటమరాయుడు' సినిమాని ఆ సినిమాకి రీమేక్‌గా తీస్తే ఏంటి లాభం.? అన్న అనుమానం వుండనే వుంది. అయినాసరే, పవన్‌కళ్యాణ్‌ చేస్తే ఆ కిక్కే వేరప్పా.. అనుకున్నారో ఏమో, రీమేక్‌ చేసేస్తున్నారు. 'అబ్బే, ఇది పూర్తిగా రీమేక్‌ కాదు..' అని పైకి చెబుతున్నా, టీజర్‌ చూస్తే మక్కీకి మక్కీ దించేశారనే అర్థమవుతోంది. 

తమిళ వెర్షన్‌తో పోల్చితే తెలుగులో కామెడీ కాస్తంత ఎక్కువగా వుంటుందట. రొమాన్స్‌ సంగతి సరే సరి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌కీ కొత్త టచ్‌ ఇచ్చారన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. ఈ మాటల్లో నిజమెంతోగానీ, రీమేక్‌ అన్న విషయాన్ని పక్కన పెట్టేసి, పవన్‌ అభిమానులు 'కాటమరాయుడు' టీజర్‌తోనూ, ఆడియో సింగిల్స్‌తోనూ, మేకింగ్‌ వీడియోస్‌తోనూ పండగ చేసేసుకుంటున్నారు.

Show comments