చిన్నమ్మకి తొందరెక్కువే.!

'ఏమో, భవిష్యత్‌ రాజకీయాలెలా వుంటాయో చెప్పలేం.. ఇప్పుడే పదవి దక్కించుకోవాలి.. లేదంటే అంతే సంగతులు..' 

- చిన్నమ్మ శశికళ ఆలోచనలు ఇలా తగలడ్డాయ్‌.! 

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్నది శశికళ కోరిక. అదిప్పటిది కాదు. జయలలిత జీవించి వున్నప్పుడే ఆమె, ఈ పీఠంపై కన్నేశారు. గతంలో, జయలలితపై విషప్రయోగానికి సన్నాహాలు జరిగాయనీ, దానికి స్వయంగా శశికళ నేతృత్వం వహించారనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కుట్ర బయటపడ్డంతో, జయలలిత - శశికళను దూరం పెట్టారట కూడా. అయితే, అవన్నీ గిట్టనివారు చేసే ఆరోపణలు మాత్రమేననీ, తన మీద కొందరు చేసిన దుష్ప్రచారంతోనే జయలలిత, తనను దూరం పెట్టారని శశికళ చెబుతుంటారనుకోండి.. అది వేరే విషయం. 

ఇప్పుడు జయలలిత జీవించి లేరు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతికి వచ్చేశాయి. నిజానికి, జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడే, పూర్తిస్థాయిలో పార్టీ మీద పట్టు సాధించారు శశికళ. ప్రభుత్వమ్మీదా పట్టు సంపాదించుకుని, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించారామె. పేరుకే పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి.. పెత్తనమంతా శశికళదే. అన్నాడీఎంకే పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ పన్నీర్‌సెల్వం మాట పట్టించుకునేవారే లేకుండాపోయారు. 

Readmore!

తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కలిసి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకి పంగనామాలు పెట్టేశారు. పదవి నుంచి తప్పుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసేశారు. పన్నీర్‌ సెల్వంకీ వేరే దారి లేదు. ఇంకోపక్క, రేపు ఎమ్మెల్యేల బృందం శశికళను కలవనుంది. శాసనసభా పక్ష నేతగా ఆమెను ఎన్నుకునేందుకూ రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 6 లేదా 9 తేదీల్లో శశికళ ముఖ్యమంత్రి పీఠమెక్కుటారట. 

జయలలిత మరణించి మూడు నెలలైనా కాలేదు.. అప్పుడే చిన్నమ్మ ఈ స్థాయిలో తొందరపడిపోతున్నారు. అయినాగానీ, ఆమెకు అడ్డు చెప్పేదెవరు.? ఇదంతా చూస్తోంటే, జయలలిత మరణం వెనుక అనుమానాల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం కదా.! ఇంతకీ చిన్నమ్మ తొందరపాటు రాజకీయం.. తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు తావిస్తుంది.? వేచి చూడాల్సిందే.

Show comments