మీతో ఎవరు పెట్టుకుంటారు రఘువీరా!

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం.. అని ప్రకటించాడు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తను కాంగ్రెస్ ను వీడేది లేదు అని ప్రకటించిన మరుసటి రోజు ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోమని రఘువీరా రెడ్డి చెప్పాడు. బహుశా.. ఇలాంటి ప్రకటనలతో తను, తన పార్టీలో ఉనికిలో ఉందని నిరూపించడానికి రఘువీరారెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాడు.

ఏ పార్టీతోనూపొత్తు పెట్టుకోమని కాంగ్రెస్ వాళ్లు ప్రకటించడం కాదు.. అసలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా ముందుకు వచ్చే పరిస్థితి ఉందా? విభజనతో అధిష్టానం చేసిన పాపంతోనే.. తెలుగునాట కాంగ్రెస్ పార్టీ తనకు తాను సమాధి కట్టుకుంది. తెలిసీ ఏపీలో, తెలీయకుండా తెలంగాణలో అధిష్టానం కాంగ్రెస్ కథకు ముగింపు రాసింది.

ఇక మూడేళ్లలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వివరించనక్కర్లేదు. ఉనికి పాట్లే సరిపోయాయి. ఉన్న ఒకరిద్దరూ వీడారు. మిగిలిన వారు తమ వ్యాపారాలు చేసుకొంటున్నారు. ఆ మధ్య ఏదో జగన్ పై కసి కొద్దీ.. ఏపీలో కాంగ్రెస్ బలపడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించడం తప్ప.. అంతకు మించిన విషయం ఏమీ లేదు. 

ఏపీలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి గురించి వివరించడానికి ఈ మాటలు చాలవు కూడా. ఇలాంటి పరిస్థితుల మధ్య రఘువీరా రెడ్డి కామెడీ డైలాగులు  వేస్తున్నారు. ఎవరితోనో పొత్తుపెట్టుకోం..ఏ పార్టీలోనూ చేరను.. అంటూ చెరువు మీద అలిగినట్టుగా వ్యవహరిస్తున్నాడు.

చెరువు మీద అలగడం వల్ల ప్రయోజనం లేదు. అయినా సొంతంగా ఒక నియోజకవర్గం మీద పట్టులేని రఘువీరారెడ్డిని ఎవరు చేర్చుకుంటారు? గతంలో ప్రాతినిధ్యం వహించిన మడకశిర ఎస్సీ రిజర్వడ్ అయ్యింది. కల్యాణదుర్గంలో ఒకసారి గెలిచాడు కానీ.. రెండోసారి అక్కడ నుంచి పోటీ చేసే ధైర్యమే లేకపోయింది ఈయనకు. మరి రేపటి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలన్నా.. ఎక్కడ నుంచి చేయాలో రఘువీరుడికి క్లారిటీ లేనట్టుగా ఉంది. మరి ఈయనను చేర్చుకుని ఎవరైనా బావుకునేది ఏముంది?

ఇక రెండోపాయింట్ కాంగ్రెస్ పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడం కాదు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొంటామని ఎవరైనా ముందుకు వస్తే వాళ్ల దుస్థితిని చూసి నవ్వుకోవాలి. కమ్యూనిస్టుపార్టీలతో పొత్తు పెట్టుకున్న వాళ్లైనా.. సాలిడ్ గా ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం వెయ్యి ఓట్లనైనా సంపాదించుకోలరు, కొన్ని చోట్ల ఐదారు వేల ఓట్లు కూడా ఉంటాయి. మరి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే దక్కేదేముంది? దానికి రఘువీరనే సమాధానం చెప్పాలి!

Show comments