ఔను.. లోకేషే, జగన్‌ని విమర్శించాలి.!

కుటుంబ సభ్యుల్ని అవమానించడంలో జగన్‌ తర్వాతే ఎవరైనా.. అంటూ తన గొప్పతనాన్ని చాలా గొప్పగా చాటేసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్‌. 'అవమానం' అన్న పదానికే బ్రాండ్‌ అంబాసిడర్‌గా తెలుగు రాజకీయాల్లో ఎప్పటికీ చంద్రబాబు పేరు నిలిచిపోతుందని నారా లోకేష్‌కి తెలియకపోతే ఎలా.? 

స్వర్గీయ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిందెవరు.? అన్న ప్రశ్న చిన్న పిల్లాడినడిగినా, సమాధానం ఠక్కున చెబుతాడు, గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడుగారేనని. అంతటి ఘనుడాయన. చంద్రబాబు నిర్వాకం గురించి, ఆయన చేతుల్లో అనేక అవమానాల్ని ఎదుర్కొన్న స్వర్గీయ ఎన్టీఆర్‌ కన్నా ఎవరికి బాగా తెలుసు.? తెలుగు రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు, ఎన్టీఆర్‌ని పొడిచిన స్థాయిలో వెన్నుపోటు రాజకీయాలు ఇంకెక్కడా జరగలేదన్నది నిర్వివాదాంశం. 

చంద్రబాబు కారణంగానే, స్వర్గీయ ఎన్టీఆర్‌ మానసిక క్షోభతో మంచం పట్టారన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఇంతా చేసి, చంద్రబాబు - ఎన్టీఆర్‌ ఫొటో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఆ తాతకి మనవడిగా నారా లోకేష్‌, స్వర్గీయ ఎన్టీఆర్‌కి జరిగిన అన్యాయంపై ఏం సమాధానం చెప్పగలుగుతారు.? వెన్ను పోటు పొడిచింది తన తండ్రే గనుక, తాతకి జరిగిన అవమానాన్ని లోకేష్‌ మర్చిపోవచ్చుగాక.. కానీ, చరిత్ర మర్చిపోదు. 

హరికృష్ణని అవమానించినదెవరు.? జూనియర్‌ ఎన్టీఆర్‌ని వాడుకుని వదిలేసిందెవరు.? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే, ఏ ప్రశ్నకీ నారా లోకేష్‌ సమాధానం చెప్పలేరుగాక చెప్పలేరు. పార్టీలో సీనియర్‌ నేతల్ని అవమానిస్తున్నారనే విమర్శల్ని ఎదుర్కొంటున్నారు నారా లోకేష్‌. ఆ విమర్శలకు వివరణ ఇచ్చుకుంటే సరిపోయేది. కానీ, కష్టపడి వైఎస్‌ జగన్‌ కుటుంబం ప్రస్తావన తీసుకొచ్చి, లోకేష్‌ అడ్డంగా బుక్కయిపోయారు. 

అసలే ట్వీటేషు.. అదేనండా నారా లోకేష్‌కి సోషల్‌ మీడియాలో ప్యాన్స్‌ ఎక్కువైపోయారు.. నిన్న మొన్నటిదాకా ఓ రేంజ్‌లో లోకేష్‌తో ఆడేసుకున్నారు వారంతా.. ఇప్పుడిదిగో, మళ్ళీ స్వర్గీయ ఎన్టీఆర్‌ వెన్నుపోటు వివాదం సహా, హరికృష్ణతోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన వైనంపై కథలు కథలుగా సోషల్‌ మీడియాలో కడిగి పారేస్తున్నారు నెటిజన్లు లోకేష్‌. బాబూ ట్వీటేషూ.. ఎందుకొచ్చిన తంటా ఇదంతా.? కొరివితో తలగోక్కోవమంటే ఇదే మరి.!

Show comments