నంద్యాల్లో ఓడితే.. అంతే సంగతులు, చిత్తగించవలెను!

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతే ఉంది. అసలు క్రితంసారి సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ గెలిచిందే చిత్రమైన పరిస్థితుల మధ్య. యడ్యూరప్ప వెళ్లి వేరేపార్టీ పెట్టుకోవడం.. రాష్ట్రమంతా పోటీచేయడం.. కమలం పార్టీని దెబ్బతీసింది.

అలాగే శ్రీరాములు వంటి వ్యక్తి వేరు కుంపటిపెట్టుకోవడం కూడా బీజేపీ అవకాశాలను అక్కడ దెబ్బతీసింది. అలాంటి పరిస్థితుల నడుమ కాంగ్రెస్‌ విజయం సాధించగలిగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఆ తర్వాత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ కర్ణాటకలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించగలిగింది.

అలా కర్ణాటకలో కమలం పార్టీ అనుకూల పరిణామాలున్నాయని స్పష్టం అయ్యింది. మరలాంటి పరిస్థితుల నడుము రెండు నియోజకవర్గాల ఉపఎన్నికలు జరిగాయి. వాటిల్లో ఒకటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణించడంతో జరిగినది, మరోటి పార్టీ ఫిరాయింపుకు సంబంధించినది.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై ఉన్న వ్యతిరేకత, బీజేపీకి ఉన్న సానుకూల పరిస్థితులు.. ఆ రెండింటి నేపథ్యంలో అక్కడ బీజేపీ విజయం ఖాయమని అంతా లెక్కేశారు. కాంగ్రెస్‌ పరువు కూడా దక్కదని అంతా అనుకున్నారు. కట్‌ చేస్తే.. ఆ ఎన్నికలు జరిగాయి.. రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించింది!

ఆ ఎన్నికల్లో జేడీఎస్‌ పోటీ చేయలేదు. పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించిందని బీజేపీ వాళ్లు నెత్తీనోరు బాదుకున్నారు. ఏదైతేనేం.. ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మరి రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ గెలుస్తుందా? అంటే చెప్పడానికి లేదు. అధికారం చేతిలో ఉంది కాబట్టి.. ఆ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ సులభంగా గెలిచింది. మరి సిద్ధరామయ్యకే అది సాధ్యం అయ్యింది.

ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితుల నడుమే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అమీతుమీ తలపడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు చేతిలో అన్ని అస్త్రాలూ ఉన్నాయి.

అధికారం, నోటిఫికేషన్‌ వచ్చేలోపు సంక్షేమ పథకాలు అమలు చేయడం.. అవతల పార్టీలోని నేతలను ఇవతలకు రప్పించుకోవడం.. అన్నీ చంద్రబాబు కూడా చేయగలడు. మరి విజయం విషయంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అంత కాన్ఫిడెన్స్‌ లేకపోవడం గమనించాల్సిన అంశం.

ఇటీవల ఇఫ్తార్‌ విందు రాజకీయం చేయబోతే.. అది అట్టర్‌ఫ్లాఫ్‌ అయ్యింది. జనాలు రాలేదని చంద్రబాబు అసహన భరితుడయ్యాడని తెలుగుదేశం అనకూల మీడియానే రాసింది.

ఇక ఇతర పరిస్థితులు కూడా ఏ మాత్రం సానుకూలంగా లేవనే అభిప్రాయమే వినిపిస్తోంది. నంద్యాల్లో గనుక టీడీపీ ఓడితే... చంద్రబాబు పాలననే కాదు, చంద్రబాబు సమర్థతను కూడా అనుమానించాల్సి వస్తుంది. పోల్‌ మేనేజ్‌ మెంట్‌తో నెగ్గడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటుంటారు కదా.. ఆ అభిప్రాయమే మారుతుంది కూడా..!

Show comments