ఇంకేం బాబూ.. అయితే ఆ ఎన్నికలు పెట్టొచ్చుగా!

తమ పార్టీకి పడే ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని సెలవిచ్చారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ సమన్వయ సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు గరిష్ట స్థాయిలో పెరిగిందని.. ఏకంగా.. 16.13 శాతం మేర ఓటింగ్ పర్సెంటేజి పెరిగిందని, గత ఏడాది సమయంలో ఈ గ్రోత్ నమోదైందని బాబు సెలవిచ్చారు. ఇదే సమయంలోవైకాపా ఓట్ల శాతం 13.45 శాతం కిందకు పడిపోయిందని బాబు తన పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని కలిగించే ఈ విషయాన్ని చెప్పారు. అయినా ఇలాంటి సర్వేల్లో చంద్రబాబు దిట్ట అని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. 

ఇలాంటి సర్వేలు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మార్కులు వేయడం చంద్రబాబుకే సాధ్యం అవుతూ ఉంటాయి. మరి ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. బాబుగారు ఏ ప్రాతిపదికన ఈ ఓట్ల శాతం పెంపు లెక్కలు చెప్పారో కానీ... ఇంత చెబుతున్నారు కాబట్టి ఒక విషయాన్ని ప్రస్తావించడం ఏ మాత్రం తప్పుకాదు. అదేమనగా.. పెండింగ్ లో ఉన్న ఎన్నికలను, ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లోనూ ఎన్నికలను నిర్వహించడం! ఏపీలో చాలాచోట్ల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. వివిధ మున్సిపాలిటీల, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ పెండింగ్ లో పడిఉంది. గ్రేటర్ విశాఖతో సహా రాష్ట్రం నలుమూలల ఉన్న మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బాబు ప్రభుత్వం ఏదో విధంగా వాటిని వాయిదా వేయిస్తోంది కానీ, వాటి నిర్వహణకు ముందుకు రావడంలేదు. 

సదరు మున్సిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగిసి చాలాకాలం అయిపోయింది కూడా. అయినా ఎన్నికల నిర్వహణ జరగడంలేదు. ఇక ఫిరాయింపుదారుల విషయంలో విమర్శలు సరే సరి. వైకాపా తరపున గెలిచిన వారిని సంతలో పశువుల్లా చంద్రబాబు కొనుక్కొచ్చిన సంగతి తెలిసిందే. (ఇది ఆయన మాటే సుమీ). మరి బాబుకు సిగ్గూశరం ఉంటే వారి చేత రాజీనామా చేయించి, ఎన్నికలను ఎదుర్కొనాలని అవతల వైకాపా సవాలు విసురుతోంది(ఇది వైకాపా మాట). మరి వారిచేత అంత మాటలు అనిపించుకోవడం ఎందుకు? తెలుగుదేశం పార్టీకి అంత శాతం ఓట్లు పెరిగినప్పుడు ఇక ఎన్నికలంటే భయమెందుకు? ఫిరాయింపుదారుల చేత రాజీనామాలు చేయించి.. వారిని తన పార్టీ తరపున గెలిపించుకోవచ్చు కదా? ఈ నంబర్ల లెక్కలు అలా నిరూపించవచ్చు కదా? తెలుగుదేశం పార్టీకి పెరిగిన ఓట్లెన్నో చాటుకోవచ్చు కదా.. ఈ విషయంలో కూడా జగనే అడ్డుపడుతున్నాడా ఏంటి?

Show comments