రోడ్లూడ్చిన బొండాకి చెప్పు సుజనా

వీధి పోరాటాలు చేస్తే ఉపయోగం లేదు.. ఢిల్లీలో పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది.. 

- ఇదీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, వైఎస్సార్సీపీకి ఇచ్చిన ఉచిత సలహా 

మరీ అరిగిపోయిన పాత రికార్డు ఇది. పాడిందే పాటరా పాచి పళ్ళ.. అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. బొత్తగా టీడీపీ నేతల వద్ద ఇంకో డైలాగ్‌ కన్పించడంలేదు. సుజనా చౌదరి అయితే మరీనూ. సినిమాల్లో సెటైర్లు పడ్తుంటాయి 'ఈ సీన్‌లో నీకు ఇదొక్కటే డైలాగ్‌..' అని. బిర్ర బిగుసుకుపోయి, అదే డైలాగ్‌ని పదే పదే రిపీట్‌ చేసేస్తుంటాడు జోకర్‌ పాత్రధారి. ఆ జోకర్‌కీ, టీడీపీ నేతలకీ ఒకటే తేడా.. టీడీపీ నేతలు కాస్త యాక్షన్‌ని మిక్స్‌ చేస్తారంతే. 

వీధి పోరాటాలు, ఢిల్లీ పోరాటాలు.. ఏం చేసినా, నరేంద్రమోడీ ఇవ్వాలనుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే ఛాన్సే లేదు. తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పాటయ్యింది.? వీధి పోరాటాలతో కాదు, ఢిల్లీ పోరాటాలతో కాదు, నిరాహార దీక్షలతో కాదు.. ఇంకే విధంగానూ కాదు. 'తెలంగాణ ఇవ్వకపోతే మాకు భవిష్యత్తు లేదు..' అని కాంగ్రెస్‌ గుర్తించింది. అలా గుర్తించడానికి పైన పేర్కొనబడ్డవన్నీ ఉపకరించాయంతే. 

ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే. నరేంద్రమోడీకి కూడా అలాంటి పరిస్థితి కల్పించగలగాలి. అలా జరగాలంటే, ఉద్యమం వీధి పోరాటాల నుంచి ఢిల్లీ స్థాయికి ఎదగాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదదే. తెలంగాణ ఉద్యమం వేరు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వేరు. పార్లమెంటు సాక్షిగా, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. ఇదిప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సమస్య కాదు, పార్లమెంటు గౌరవానికి పరీక్ష. ప్రజాస్వామ్యానికి పెను సవాల్‌ ఇది. 

విలువలన్నిటినీ కలిపి లుంగచుట్టేసి, పద్ధతులు, రాజ్యాంగాలు, ప్రజాస్వామ్య విధానాలు.. ఇవేవీ లేవు.. నేనే కింగ్‌.. అన్నట్లు నరేంద్రమోడీ వ్యవహరిస్తోంటే, ఆయన చుట్టూ చేరి సుజనా చౌదరి లాంటోళ్ళు బాకా ఊదుతున్నారంతే. తప్పదు మరి, చంద్రబాబు భజన చేస్తోంటే, ఆ భజనకు సుజనా సహా టీడీపీ నేతలంతా బాకా ఊదాల్సిందే కదా. వీధి పోరాటాలతో ప్రత్యేక హోదా రాదన్న సుజనా చౌదరి మాటలే నిజమైతే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు రోడ్లూడ్చింది ఎందుకట.? 

బీజేపీకి కనువిప్పు కలగాలంటూ నిన్ననే బొండా ఉమామహేశ్వరరావు రోడ్లూడ్చారు.. బీజేపీ కార్యాలయం వద్ద కార్లు తుడిచారు. ఇంకొకాయన, అదేనండీ ధూళిపాళ్ళ నరేంద్ర అయితే ఏకంగా టైమ్‌ పాస్‌ దీక్ష కూడా చేసేశారు ప్రత్యేక హోదా కోసం. ఇవన్నీ ఏంటి.? సుజనా చౌదరికి తానేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందో లేదో.! ఓ కన్ను చంద్రబాబు వైపు, ఇంకో కన్ను నరేంద్రమోడీ వైపు తప్ప, ఆంధ్రప్రదేశ్‌ వైపు ఆయన చూపు లేదాయె. 

చేతనైతే, కేంద్ర మంత్రి హోదాలో రాజ్యసభ గౌరవం ఏంటి.? ఆ రాజ్యసభ సాక్షిగా ఓ ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి విలువెంత.? అన్నది తెలుసుకుని, దేశ ప్రజానీకానికి తెలియజెప్పాలి. అది చేతకాకపోతే.. గమ్మునుండాలి. అంతకు మించి, అతి చేస్తే.. చరిత్ర క్షమించదు.

Show comments