అబ్జర్వేషన్‌: భూ బకాసురులకు చెంపదెబ్బ

అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి.. ఆ పరిశ్రమల కోసం భూమిని కేటాయించాల్సి వుంటుంది. మామూలుగా అయితే, అవసరానికి తగ్గట్లుగా డిమాండ్‌ పెరుగుతుంది.. ఆ డిమాండ్‌కి తగ్గట్టుగా రేటు మారుతుంటుంది. కానీ, ప్రభుత్వాలు కోరుకుంటే, అవసరం - డిమాండ్‌ - రేటు అన్న ఈక్వేషన్‌ పనిచేయదు. బక్కోడి పొట్ట కొట్టడంలో పాలకులు చూపించే అత్యుత్సాహం అలా వుంటుంది. పరిశ్రమలొస్తే బాగుపడేది మీరే కదా.. అంటూ తిరిగి, ప్రజలకే ఉచిత సలహాలిస్తుంటారు పాలకులు. 

అదే, ఓ రోడ్డు నిర్మాణంలో బడా రాజకీయ నాయకుడెవరిదైనా భూమి కోల్పోవాల్సి వచ్చిందనుకోండి.. అక్కడ రాజకీయం పనిచేస్తుంటుంది. దాంతో, ఆ రోడ్డు తిరిగే వంకర్లు అలా ఇలా వుండవు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేసి మరీ, రోడ్డుని అడ్డదిడ్డంగా నిర్మించేస్తారు. సామాన్యుడి విషయంలో మాత్రం అలా జరగదు. ఎందుకంటే, సామాన్యుడు బక్కోడు కాబట్టి. 

పశ్చిమబెంగాల్‌లో టాటా నానో కార్ల ప్లాంట్‌ కోసం అప్పట్లో, దాదాపు వెయ్యి ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. దాదాపు పదేళ్ళ తర్వాత, ఆ భూ సేకరణ అక్రమం అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇచ్చిన పరిహారాన్ని సైతం తిరిగి రైతుల నుంచి తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. 'హమ్మయ్య.. నేనిక ప్రశాంతంగా చనిపోవచ్చు..' అంటూ ఆనాటి భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రస్తుత పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నారు. అప్పట్లో వామపక్షాలు అధికారంలో వుండేవి. 

ఏం, అవసరమైతే ఇప్పుడు మమతా బెనర్జీ భూ సేకరణ చేయకుండా వుంటారా.? ఛాన్సే లేదు. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, రాజధాని కోసం వేలాది ఎకరాల భూముల్ని ప్రభుత్వం సేకరిస్తోంది. దానికి 'సమీకరణ' అనే ముసుగు కప్పింది. ఎంతైనా చంద్రబాబుకి ముందు చూపు ఎక్కువ కదా.! భూమిని సేకరిస్తే వివాదాలొస్తాయని, సమీకరణ పేరుతో పని కానిచ్చేశారు. రెండేళ్ళు గడిచిరింది అమరావతి నిర్మాణం అసలు మొదలే కాలేదు. ఏమో, అదెప్పటికి పూర్తవుతుందో ఎవరికి ఎరుక.? ఇంకా కొంత భూమిని సేకరించాల్సి వుంది. ఈలోగా, సుప్రీంకోర్టు పిడుగు లాంటి తీర్పునిచ్చిందాయె.! 

తెలంగాణ విషయానికొద్దాం, ప్రాజెక్టుల పేరుతో సామాన్యుల పొట్ట కొడ్తోంది తెలంగాణ సర్కార్‌. భూ సేకరణ చట్టాన్ని సైతం తుంగలో తొక్కేసి, జీవోల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అవసరమే, తెలంగాణకి ప్రాజెక్టులూ అవసరమే. కానీ, వాటిల్లో ప్రజల బతుకుల్ని సమాధి చెయ్యకూడదు కదా.?

Show comments