ఇప్పటికే రాష్ట్రీయ సమాజ్ వాదీ పార్టీ పేరుతో పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయించాడు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. తండ్రితో విబేధాల నేపథ్యంలో.. ఏ క్షణమైనా కొత్త గూడును చేరుకునేందుకు ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. పార్టీ పేరు విషయంలో కూడా తేడా రాకుండా.. ‘సమాజ్ వాదీ’ అని అందులో కూడా పలికేలా చూసుకోవడంతో ఆయన జాగ్రత్తల్లో ఆయనున్నాడని స్పష్టం అవుతోంది.
ఇక ఇదే సమయంలో.. గుర్తు విషయంలో కూడా అఖిలేష్ పోరాడటం ఖాయమైనట్టే. అఖిలేష్, శివపాల్ యాదవ్ ల ఆధ్వర్యంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు, పార్టీ ఎన్నికలకు గుర్తింపును ఇవ్వవద్దని ఈసీకి ఫిర్యాదు చేసింది ములాయం వర్గం. సమాజ్ వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ దేనని.. ఈ పార్టీపై సర్వహక్కులూ ఆయనవేనని ఈ వర్గం వాదిస్తోంది. మరి ఈ జటిలమైన అంశం గురించి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అత్యంత ఆసక్తికరమైన అంశం.
ఒకవేళ శివపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఎన్నిక చెల్లదని ఈసీ స్పష్టం చేస్తే మాత్రం.. అఖిలేష్ ‘రాష్ట్రీయ సమాజ్ వాదీ పార్టీ’ ని పట్టాలెక్కేంచే అవకాశాలుంటాయి. అలాగే సైకిల్ గుర్తు విషయంలో కూడా పోరాటం ఖాయం కావొచ్చు.
దాదాపు 22 యేళ్ల కిందట ఇలాగే ఒక ‘సైకిల్’ గుర్తు పార్టీ లో కుటుంబ వివాదం రేగి, అధినేతను పదవీ భ్రష్టుడిని చేయడంతో పాటు, బయటకు పంపించేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ కుటుంబ ఆధిపత్య పోరు కారణంగా మరో సైకిల్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీలోనూ ఆ స్థాయి విబేధాలొస్తాయని అంతకు ముందు ఎవరూ ఊహించలేదు, సమాజ్ వాదీ పార్టీ పరిస్థితి ఈ రకంగా తయారవుతుందని ఐదారు నెలల కిందట వరకూ ఏ ఒక్కరూ అస్సలు ఊహించలేదు! బహుశా ‘సైకిల్’ గుర్తు లోనే ఏదో యాంటీ సెంటిమెంటు .. మంటలు రేపే గుణంగా ఉన్నట్టుంది!