ఏపీ సినిమాలో హీరో ఎవరు.. ఇది తాజాగా తెరపైకి వచ్చిన విషయం. నిన్నటి దాకా చీపుర్లు, చెప్పులు అయిపోయాయి. విపక్షనేత జగన్ తాజాగా సినిమాను తెరపైకి తెచ్చారు. ఏపీలో జరుగుతున్న తంతును సినిమాతో పోల్చారు జగన్. సినిమాలో 14రీళ్లుంటాయన్నారు. 13 రీల్ వరకు విలన్ ఏం చేసినా గెలిచినట్టే కనిపిస్తాడన్నారు. చివరి రీల్లో హీరో ఎంటర్ అవుతాడన్నారు. ఆయనకు ప్రజలు అండగా నిలుస్తారని చెప్పారు. దైవం కూడా తోడవుతుందన్నారు. ఇక విలన్ ను వీరబాదుడే ఉంటుందన్నారు. చివరకు విలన్ చిత్తవుతాడు, హీరో విన్నవుతాడు. ఇదీ జగన్ చెప్పిన కథ.
ఇంత వరకు బాగానే ఉంది. ఆ సినిమా లో హీరో ఎవరో చెప్పలేదు. రియల్ సినిమా జగన్ అన్నట్టు 14రీళ్లు ఉంటే ఏపీ పొలిటికల్ సినిమా అయిదేండ్లు అనుకుందాం. ఇప్పటికే సినిమా రెండేళ్లు పూర్తిచేసుకుంది. అంటే సగం కూడా కాలేదు. ఇప్పటికి ఇంటర్వెల్ రాలేదు. సహజంగా సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. సినిమాలకు కీలకమైన మలుపు తిప్పే ట్విస్టు ఉంటుంది. ఏపీ సినిమాకు అలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందా, ఉంటే అదేంటి అన్నది చూడాలి.
సినిమానే అనుకుందాం, జగన్ హీరో ఎవరో డైరెక్టుగా చెప్పకున్నా... విలన్ ఎవరో మాత్రం చెప్పేసాడు. ఆయనే చంద్రబాబు. జగన్ అభిప్రాయం మేరకు విలన్ తన అంగబలం, అర్థబలంతో ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతాడు, వాటిని జనాల చేత ఒప్పిస్తాడు, లేదంటే బలప్రయోగం చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడన్నది జగన్ మాటల్లోని అర్థం. ఇది సరే కాని చంద్రబాబును వీరబాదుడు బాడే ఆ హీరో ఎవరు, ఎప్పుడొస్తాడు, ఇప్పటి వరకు జరిగిన రెండేండ్ల ఏపీ సినిమాలో తెరపై కనిపించాడా, లేక హటాత్తుగా మున్ముందు తెరపైకి వస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. జగన్ నేరుగా చెప్పకున్నా.. ఆయనే ఆ హీరో అన్న విషయం పరోక్షంగా చెప్పేసాడు. ఆయనవుతాడా కాదా అన్న సందేహం మాత్రం జనాల్లో కొంత మేర ఉందనడంలో సందేహం లేదు.
కారణం ఎపి సినిమాలో మరో హీరో కూడా వున్నాడు. ఆయన అప్పుడప్పుడు కనిపిస్తూ హల్ చల్ చేస్తున్నాడు. మళ్లీ కనిపించకుండా పోతున్నాడు. తాను ఈ సినిమాలో ఉన్నానని మరిచిపోవద్దని చెప్పడానికి ఇక ముందు కూడా అప్పుడు అప్పుడు గెస్ట్ రోల్ లాగా వస్తాడేమో. ఆయనెవరో తెలియందెవరికి ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్. సరే ఈయనకు ఏపీ సినిమాలో హీరో అయ్యే అవకాశం ఉందో లేదో తెలియదు. కారణం ఈయన విలన్ పై ఇంకా పోరాటం ప్రారంభించనే లేదు.
సినిమాలో అయితే ప్రేక్షకులు కొంత మేర ఈయనే హీరో కావచ్చు, ఈయనే విలన్ కావచ్చు, మున్ముందు ఇలా జరుగుతుంది కావచ్చు అని ఊహకు అందే అవకాశం కొంత వుంటుంది. ఆమేరకు ఇప్పటి ఏపీ సినిమాను చూస్తున్న జనాలు కొందరు చంద్రబాబును హీరోగా, మరికొందరు జగన్ ను హీరోగా భావిస్తున్నారు. ఇంకొందరు సినిమా ముగిసే సమయానికి అనూహ్యపరిణామాలు చోటు చేసుకుని రియల్ హీరో ఎంటర్ అవుతాడని కూడా చర్చించుకుంటున్నారు.
జగన్ చెప్పినట్లు సినిమా అంతా కూడా చివరి వరకు విలన్ దే పైచేయిగా నడుస్తుంది. కాని ఏపీ సినిమాలో అలా జరగట్లేదు. ఏపిలో చంద్రబాబుకూడా చాలా ఎదురుదెబ్బలు తింటున్నారు. తాను చెప్పినవి చేయట్లేదు కాబట్టి విలన్ గా మిగిలిపోతాడని భావించడానికి వీలు లేదు, తన వల్ల అయినవి చేస్తున్నారు, తన వల్ల కానివి, మరొకరు అంటే కేంద్రం చేయాల్సినవాటిని చేయలేకపోతూ ఎదురుదెబ్బతింటున్నారు. ఓ రకంగా ఏపీ జనాల కోసం ఆయన కూడా కేంద్రంతో పోరాడుతున్నారు. అంటే ప్రజల కోసం పోరాడుతూ కనిపిస్తున్న వారిలో చంద్రబాబు కూడా ఉన్నాడు. అంటే ఈ సినిమాలో చంద్రబాబు కూడా హీరో కావడానికి చాన్స్ లు వున్నాయి.
మొత్తం మీద ఏపీ సినిమా అంతా మల్టీ స్టారర్ గా కనిపిస్తోంది.. కనీసం ఇంటర్వెల్ నుంచైనా చూసేలా ఉంటుందా, ఓటుతో ఈ సినిమా టికెట్ కొనుక్కుని చూస్తున్న ఏపీ జనానికి మంచి సినిమా చూసిన తృప్తి మిగులుతుందా అనేది అసలు ప్రశ్న.