ఇంత నిస్సిగ్గుగా.. ఇదేం భజన.?

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ అనుకూల మీడియాకి విపరీతమైన అభిమానం వుండొచ్చుగాక. చంద్రబాబుకి అనుకూలంగా వార్తలు రాసుకోవచ్చుగాక. కానీ, లేనిది వున్నట్లు రాసి, చంద్రబాబుని మునగచెట్టు ఎక్కించడం, తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని దెబ్బతీయడం, అన్నిటికీ మించి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం ఎంతవరకు సబబు.? 

చైనా టూర్‌ ముగిసింది.. ఢిల్లీ టూర్‌ కూడా ముగిసింది. చైనా నుంచి చంద్రబాబు ఏం తీసుకొచ్చారో తెలియదు, ఢిల్లీ నుంచి ఏం తీసుకొస్తున్నారో తెలియదు. అసలు, చంద్రబాబు చైనాకి ఎందుకు వెళ్ళారో ఎవరికీ తెలియని పరిస్థితి. చైనా నుంచి సరాసరి ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్‌ అవక.. మధ్యలో ఢిల్లీలో దిగి, ఢిల్లీ పెద్దల దర్శనం చేసుకుని, వారికి వంగి వంగి దండాలు పెట్టి.. అక్కడ 'పని' పూర్తయ్యాక, విజయవాడకు పయనమవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.! 

ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ భవన ప్రారంభోత్సవం జూన్‌ 29న జరిగింది. ఆ రోజుకు అటూ ఇటూగా గుంటూరు, విజయవాడల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఈ కార్యక్రమాలకి చంద్రబాబు డుమ్మా కొట్టేశారు. తప్పదు మరి, ఆల్రెడీ సచివాలయాన్ని చంద్రబాబు ప్రారంభించేశారుగనుక, ఇప్పట్లో ఇంకా అందుబాటులోకి రాని ఆ సచివాలయానికి మరోసారి ప్రారంభోత్సవం చెయ్యడానికి బహుశా చంద్రబాబుకి మనస్కరించినట్లు లేదు.. అందుకే, చైనాకి చెక్కేశారు. 

ఇక, చైనా నుంచి చంద్రబాబు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారుగానీ, ఆ ఒప్పందాలు పూర్తిస్థాయిలో నిజమవుతాయని అనుకోవడానికి వీల్లేదు. కానీ, టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం 58 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని తీసుకొచ్చేస్తున్నారు చైనా నుంచి.. అంటూ భజన షురూ అయ్యింది. పెట్టుబడుల మాట తర్వాత, సూట్‌కేసులు చైనా నుంచి మోసుకొచ్చి, ఢిల్లీ పెద్దలకు సమర్పించారా.? అన్నట్టు, ఢిల్లీలో చంద్రబాబు మకాం వేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై చంద్రబాబు, కేంద్రంతో చర్చలు జరుపుతారని చైనా పర్యటన ముగించుకుని, చంద్రబాబు ఢిల్లీకి పయనమవడం గురించి టీడీపీ అనుకూల మీడియా ప్రచారం షురూ చేసింది. అయితే, చావు కబురు చల్లగా చెప్పేశారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. చైనా ఆర్థిక వ్యవస్థ, అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని అధ్యయనం చేసిన చంద్రబాబు, ఆ వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో చర్చించారటన్నది చౌదరిగారి ఉవాచ. 

టీడీపీ అనుకూల మీడియా మాత్రం, విభజన చట్టంలోని అంశాల గురించీ, ప్రత్యేక హోదా గురించీ, అలాగే రాజధాని నిధుల గురించీ కేంద్రాన్ని చంద్రబాబు కోరారనీ, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చేలా గట్టిగా మాట్లాడారనీ ప్రచారం మొదలు పెట్టింది. ఆయనే ఉంటే.. అదేదో ఎందుకన్నట్లు తయారయ్యింది వ్యవహారం. చంద్రబాబే అంత సమర్థుడైతే, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదే.! అయినా ఇంత నిస్సిగ్గుగా చంద్రబాబు భజనలో టీడీపీ అనుకూల మీడియా ఎలా మునిగి తేలుతున్నట్లు.?

Show comments