చేతనైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా.!

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం.. అంటే, దానికో ప్రత్యేకమైన గౌరవం వుంది. అమావాశ్యకీ పున్నమికీ కాదు.. ఏడాదికోసారి.. అదేదో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ అన్నట్లుగానో, ఏదన్నా పండగ అన్నట్లుగానో కన్పిస్తే కుదరదు. ఎన్నయినా చెప్పండి, పవన్‌కళ్యాణ్‌ మారడుగాక మారడు. ఆయన అందర్నీ ప్రశ్నిస్తాడు, ఆయన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడు. 

మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది.. మరో మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రశ్నిస్తోంది. ఆఖరికి వామపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. 'చేతనైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా..' అని ఇంతమంది ఇంతలా ప్రశ్నిస్తున్నా, పవన్‌కళ్యాణ్‌ వైపు నుంచి 'నో ఆన్సర్‌'. అంతే, ఎప్పటికీ పవన్‌ నుంచి సమాధానం రాదంతే. ఎందుకంటే, ఆయన పవన్‌కళ్యాణ్‌. 

సినిమా అయినా, రాజకీయం అయినా పవన్‌కళ్యాణ్‌కి ఒకటే. సినిమాల మీద ఇంట్రెస్ట్‌ లేదనీ, సినిమాలు తనకు అంతగా కిక్‌ ఇవ్వడంలేదనీ పవన్‌కళ్యాణ్‌ చెబుతుంటాడుగానీ, రాజకీయాలతో పోల్చితే సినిమాలకే ఆయన కాస్తో కూస్తో ప్రిఫరెన్స్‌ ఇస్తారు. సినిమా మీద పెట్టినంత ఫోకస్‌ కూడా పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల మీద పెట్టకపోవడం శోచనీయమే. మామూలుగా అయితే పవన్‌, రాజకీయాల గురించి మాట్లాడాలని ఎవరూ అనరు. కానీ, ఆయన జనసేన పార్టీ అధినేత కదా.. అందునా, అందర్నీ ప్రశ్నిస్తానంటాడు కదా.. అక్కడే వస్తుంది చిక్కు అంతా.! 

ఇదివరకటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. 'అధికారం నాకు కిక్‌ ఇవ్వదబ్బా.. మీరు.. మీరే, నాకు నిజమైన కిక్కు ఇవ్వగలరు..' అని సినిమాటిక్‌ డైలాగ్‌ చెప్పడం వరకూ ఓకే. కానీ, ఆ డైలాగులు అభిమానులకి సైతం శాశ్వతంగా కిక్‌ ఇవ్వలేవు. ఒక్కరంటే ఒక్కరు, జనసేన పార్టీ తరఫున ఇతర పార్టీల నుంచి విమర్శలకు సమాధానం చెప్పలేని దుస్థితి. అసలు వుంటేగా, చెప్పడానికి.! పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం చేతనవుతుందా? చేత కాదా? ఇదొక్కటే ప్రశ్న. సమాధానం చెప్పేదెవరు.?

Show comments