ఉద్యమిస్తా..అన్న మాట చాలా తేలిక అయిపోయింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అయితే షూటింగ్ కు వెళ్లి వస్తా అని చెప్పినంత తేలిక. ఆ మధ్య ఇలాగే తిరుపతి, కాకినాడల్లో ఘర్జించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఉద్యమమే అని. అదేదో లేస్తే మనిషిని కానని అన్నట్లు. భాజపా లైట్ తీసుకుంది. తేదేపా, అబ్బోసి అనుకుంది. పవన్ తన షూటింగ్ పని తాను చూసుకున్నారు. ఆ విధంగా ఆ ఉద్యమం ముగిసింది.
ఇప్పుడు కొత్తగా మళ్లీ ఉద్యమిస్తా అంటున్నారు పవన్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు ప్రభుత్వం సహాయం అందించడం ప్రారంభించకుంటే ఉద్యమిస్తా అని పవన్ ప్రకటించేసారు. అలా అని భయపడిపోనక్కరలేదు. ఇంకా నెలరోజులు టైమ్ వుంది. పది హేను రోజులు నివేదిక ఇవ్వడానికి, ఆపైన 15 రోజులు చర్య తీసుకోవడానికి. అప్పుడు పవన్ ఉద్యమిస్తారు. అప్పుడు కూడా ఉద్యమించేస్తారేమో అని భయపడనక్కరలేదు.
ఉద్యమం అంటే షూటింగ్ కు ఒకరోజు గ్యాప్ ఇచ్చి, ఈవెనింగ్ ఫ్లయిట్ కు విశాఖ వెళ్లి, మాంచి స్టార్ హోటల్లో సేద తీరి, కారులో వెళ్లి బాధితులతో మాట్లాడి, మళ్లీ ఫ్లయిట్ లో హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు కాదు. ఉద్యమం అంటే అదో పోరాటం. ఇప్పటి దాకా పవన్ చేస్తున్న ప్రకటనలు, వగైరా చూస్తుంటే మాత్రం ఆయన ఉద్యమం చేస్తారని ఏమాత్రం నమ్మకం కలగదు. పైగా కాటమ రాయుడు విడుదల దగ్గరకు వస్తోంది..ఆ పైన త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. దాని తరువాత మరో సినిమా వుంది. మధ్యలో టూర్లకు, ట్వీట్లకు టైమ్ వుంటుందేమో కానీ ఉద్యమానికి కాదు.