ప్రతి ఏటా ఇకపై ఓ తెలుగు సినిమా నిర్మిస్తానని కన్నడ నిర్మాత, పొలిటీషియన్ కుమారస్వామి గౌడ వెల్లడించారు. ఆయన తన కుమారుడు నిఖిల్ గౌడతో నిర్మించిన సినిమా అడియో ఫంక్షన్ విజయవంతగా జరిగిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. తాను ముందు సినిమా డిస్ట్రిబ్యూటర్ ను అని, నిర్మాతనని, ఆ తరువాతే పాలిటిక్స్ లోకి వచ్చానని ఆయన వెల్లడించారు.
రాజకీయాల్లో బిజీ కావడంతో కాస్త గ్యాప్ వచ్చిందని, కొడుకును హీరో గా చూసుకోవడం కోసం మళ్లీ సినిమాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. అయితే తను కొడుకుకు తో సినిమా చేస్తే నిర్మాతలు సేఫ్ అవుతారనే నమ్మకం వచ్చే వరకు తను మాత్రమే సినిమాలు చేస్తానని, ఆ తరువాత బయటవారికి అవకాశం ఇస్తానని ఆయన అన్నారు. తన వల్ల వేరే వాళ్లు ఇబ్బంది పడడం తనకు ఇష్టం వుండదన్నారు.
టాలీవుడ్ లోనే..
నిఖిల్ తన కెరీర్ ను టాలీవుడ్ లోనే కొనసాగించాలనుకుంటున్నాడని, తెలుగు ప్రజల సినిమా అభిమానం, ఇక్కడి మార్కెట్, ఇక్కడ దర్శకులు ఇవన్నీ కూడా ఈ నిర్ణయానికి కారణమని అన్నారు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో నిఖిల్ సినిమాలు చేసే అవకాశం వుందన్నారు.
దర్శకుడి కన్నా కూడా తనకు స్క్రిప్ట్ ముఖ్యమని, అది నచ్చిన తరువాతే సినిమా చేస్తానని అన్నారు. కన్నడలో మంచి దర్శకులు వున్నారు కానీ, వారంతా చిన్న సినిమాలు క్రియేటివ్ గా తీస్తున్నారని అన్నారు. కన్నడ సినిమా మార్కెట్ కూడా ఇప్పుడు పెరిగిందని, మంచి సినిమా పడితే ఇరవై కోట్ల మేరకు షేర్ లు వస్తున్నాయని కుమారస్వామి వెల్లడించారు.
రాజకీయాల్లోకి రాకూడదనే
తనతోనే తమ కుటుంబ రాజకీయాలు సరి అని, తన కొడుకు నిఖిల్ కు ఆ విషయం ముందే చెప్పానని, ఆల్టర్నేటివ్ కెరీర్ చూసుకోమని కోరానని కుమారస్వామి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందుకే నిఖల్ సినిమాల్లోకి వచ్చాడన్నారు. జాగ్వార్ సినిమాలో హీరో, హీరోయిన్ తప్ప మిగిలిన అందరూ తెలుగువారికి సుపరిచితులేనని, జాగ్వార్ తెలుగు సినిమానే అని ఆయన వివరించారు.
అయిదు వందల మంది డ్యాన్సర్లతో మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తీసామని, అలాగే విదేశాల్లో భారీ ఛేజ్, ఫైట్ తీసామని వివరించారు. దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పిన కథ నచ్చక, విజయేంద్రప్రసాద్ ను అప్రోచ్ అయ్యామని, ఆయన మంచి కథ ఇచ్చారని అన్నారు.
ఈ కథ ముమ్మాటికి నిఖిల్ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే కథ అని ఆయన వివరించారు. తాను క్వాలిటీని నమ్ముతానని, అందుకే ఖర్చుకు వెనకాడలేదని, కొత్త కుర్రాడు, అంత ఖర్చు అవసరమా కాదా అన్నది ఆలోచించలేదని మరో ప్రశ్నకు సమాధానంగా వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో సినిమా వుంటుందని, దానికి కూడా తెలుగు దర్శకుడే సారథ్యం వహిస్తారని వెల్లడించారు.