శ్రీశాంత్‌ గెలిచాడుగానీ.!

క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఒకప్పుడు క్రికెట్‌లో సంచలనాలకి మారు పేరు. టీమిండియాలో ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలోకి మెరుపులా దూసుకొచ్చాడు. ఎదుగుతున్న టైమ్‌లో అనూహ్యంగా 'స్పాట్‌ ఫిక్సింగ్‌' ఆరోపణలతో క్రికెట్‌కి దూరమైపోయాడు శ్రీశాంత్‌. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పుణ్యమా అని, భారత క్రికెట్‌కి తగిలిన అతి పెద్ద దెబ్బ 'స్పాట్‌ ఫిక్సింగ్‌'. ఈ ఫిక్సింగ్‌కి సంబంధించి పెద్ద తలకాయల్ని తప్పించేసి, శ్రీశాంత్‌తోపాటు మరో ఇద్దరు ముగ్గురు క్రికెటర్లను బలి పశువుల్ని చేసేశారనే ఆరోపణలున్నాయి. 

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ, శ్రీశాంత్‌పై జీవిత కాల నిషేధం విధించిన విషయం విదితమే. ఇప్పుడా నిషేధం ఎత్తివేయబడింది. కేరళ హైకోర్టు ఈ కేసు విచారణలో కీలక తీర్పు వెల్లడించింది. దాంతో, శ్రీశాంత్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ, క్రికెట్‌లోకి శ్రీశాంత్‌ మళ్ళీ పునరాగమనం చేసే అవకాశమైతే లేదు. 

అన్నట్టు, శ్రీశాంత్‌ క్రికెట్‌కి దూరమయ్యాక, రాజకీయాలకు దగ్గరయ్యాడు. దురదృష్టవశాత్తూ రాజకీయాల్లోనూ శ్రీశాంత్‌కి కాలం కలిసిరాలేదు. సినీ రంగ ప్రవేశం చేశాడు. అక్కడా, శ్రీశాంత్‌ టైమ్‌ ఏమంత గొప్పగా లేకపోవడం గమనార్హం. 

'క్రికెట్‌ ఆడే సత్తా నాలో ఇంకా అలాగే వుంది. కానీ, కొందరు పనిగట్టుకుని నా కెరీర్‌ని నాశనం చేశారని తలచుకుంటే, క్రికెట్‌పై కోపమొచ్చేస్తుంటుంది..' అంటూ శ్రీశాంత్‌ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.

Show comments