ఏపీ ప్రజలకు ఇది తీవ్రమైన వంచన, అవమానం

కే్ంద్రప్రభుత్వం తన అహంకారాన్ని మరోమారు చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఎంత చులకన భావం ఉన్నదో.. ప్రత్యేకహోదాకు సైంధవుడిలా అడ్డుపడుతూ వచ్చిన అరుణ్ జైట్లీ మరో మారు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో చేసేయబోతున్నారంటూ, హోదా బదులుగా పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇస్తున్నారని దానికి సంబంధించి తీవ్రమైన కసరత్తు చేస్తున్నారని.. ఉదయం నుంచి పదేపదే ఊదరగొట్టిన సర్కారు.. రాత్రి 11 గంటల సమయంలో పెట్టిన ప్రెస్ మీట్ లో దారుణంగా నిరాశపరిచారు

అన్నీ పాతహామీలు.. ఇదివరకే అమల్లో ఉన్నవి. ఇదివరకే చెప్పిన పాత విషయాలను చెప్పి.. అన్ని హామీలు తీరుస్తాం అనే పనికిరాని ప్రకటనతో జైట్లీ ముగించారు.

వెంకయ్యనాయుడు తక్కువ తినలేదు. ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు కేంద్రం సహాయం చేస్తూనే ఉంటుంది.. అనే పడికట్టు పదజాలంతో తనకు అలవాటైన మోసం చేయడానికి ఆయన వంతు ప్రయత్నం చేశారు. జైట్లీ తాము ఏపీకి ఏదో విద్యా సంస్థలు ఇచ్చేశాం.. అంటూ ఊదరగొడుతున్నారే తప్ప.. ఇప్పుడు నిర్దిష్టంగా ఏం ఇవ్వబోతున్నారో మాత్రం చెప్పలేదు. 

రెవిన్యూలోటు భరించడం, పోలవరం ఖర్చు భరించడం వంటివి అసలు కొత్తగా రాష్ట్రానికి చేస్తున్న మేలు ఎలా అవుతుందో.. ఏపీ ప్రజలని జైట్లీ ఎంత దారుణంగా మోసం చేశారో, ఎంత నీచంగా చూస్తున్నారో నని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మరి ఏపీ తెలుగుజాతికి జరిగిన ఈ అవమానం చంద్రబాబునాయుడుకు ఎలా రుచిస్తున్నదో మాత్రం తెలియడం లేదు. 

ఆయన కూడా ఉదయం నుంచి వేరే పనేమీ లేనట్లుగా.. ఇవాళ్టి అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని.. ఢిల్లీలో జరుగుతున్న కసరత్తును హైటెక్ పద్ధతుల్లో ఇక్కడనుంచి పర్యవేక్షిస్తూ , అమరావతి నుంచి ఆ కసరత్తులో పాల్గొంటూ  వచ్చారు. అయితే తీరా అది తుస్సుమంది. ఇప్పుడు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికి జైట్లీ ప్రకటనపై అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 

Show comments