వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలపై హామీల వర్షం కురిపంచారు. రాష్ట్రంలోని ప్రతి వర్గం లబ్దిపొందేలా నవరత్నాల పేరుతో తొమ్మిది కీలక వాగ్దానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్ల వర్షం కురిపిస్తాయని జగన్ భావిస్తున్న ఈ హామీల్లో కొత్తదనం కొరవడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్లు, రైతులకు ఆర్థిక సహాయం, మద్య నిషేధం వంటివి ఇప్పటిదాకా అన్ని రాజకీయపార్టీలు చెప్పిన మాటలేనని, వీటితోపాటుగా జగన్ మార్కు పథకంగా ఒక ప్రధానమైన హామీ ప్రకటించి ఉంటే బాగుండేదని పార్టీ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. విన్నవెంటనే ఔరా!.. అనిపించేలా ప్రజల దృష్టిని ఒక్క ఉదుటన ఆకర్శించే పథకం కొరవడిందని పెదవి విరుస్తున్నారు. చదువుకునే పిల్లలకు నెలనెలా ఆర్థిక సహాయం పథకం ఒక్కటే కాస్త ఆకర్శణీయంగా ఉందని అంటున్నారు.
రైతుల రుణమాఫీ, ఆర్థిక సహాయం, డ్వాక్రా రుణాల మాఫీ, పెన్షన్లు, పక్కా గృహాలు, జలయగ్నం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, మద్యనిషేధం.. ఈ పదాలు దశాబ్ధకాలంగా తెలుగు ప్రజలు వింటున్నవే.
అందులో కొన్ని ప్రస్తుత, గత ప్రభుత్వాలు అమలు చేసినవి.. చేస్తున్నవే. అయినప్పటికీ పెన్షన్లు, పక్కా ఇళ్లు వంటి పథకాలు ఎప్పటికీ కొనసాగేవే కనుక వాటిని హామీల లిస్టులో చేర్చడంలో సహజమే. వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను ఆయన వారసుడిగా జగన్ కొనసాగిస్తానని ప్రకటించడం కూడా ఊహించిందే.
ఈ పథకాలకు ప్రజలు అలవాటు పడిపోయారు కనుక వాటి పట్ల అంతగా ఆకర్శితులవరని కొందరు విశ్లేషిస్తున్నారు. తను ముఖ్యమంత్రి అయితే తండ్రి వైఎస్ పథకాల కొనసాగింపుతోపాటు తన పాలనలో అమలు చేయబోయే సరికొత్త పథకం ఒకటి ప్రకటించకపోవడంపై వైసీపీ వర్గాల్లో కాస్త నిరాశ అలుముకుంది.
2004లో రైతులకు ఉచిత విద్యుత్, బకాయిల మాఫీ అనే ఒకే ఒక్క ప్రధాన హామీతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పని పథకాలను కూడా అమలు చేసి రెండో సారి కూడా పదవి కాపాడుకున్నారు. 2014లో బాబు తిరిగి అధికారంలోకి రావడంలో రైతు రుణమాఫీ కీలక పాత్ర పోషించింది.
ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చివేసే ఇలాంటి ప్రత్యేకమైన, రాష్ట్రప్రజలందరికీ కొత్తగా, ఆసక్తిగా అనిపించే ట్రేడ్‌మార్కు పథకం జగన్ ప్రకటించి ఉండాల్సిందని సొంత పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు చేపట్టనున్న పాదయాత్రలో హైలైట్‌గా నిలిచే హామీ కొరవడిందంటున్నారు.
చుదువుకునే పేద పిల్లలకు నెల నెలా ఆర్థిక సహాయం పథకం కాస్త భిన్నంగా ఉన్నా కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని పోలి ఉందని అంటున్నారు. రైతులకు ఏటా తొలకరి కాలంలో రూ.12500 ఆర్థిక సహాయం రైతులను ఆకర్శించేదే. అయితే కేసీఆర్ ఇటీవలే ఇలాంటి పథకాన్ని తెలంగాణలో ప్రారంభించారు. పంట వేసేముందు ఎరువుల కోసం రూ.4 వేలు ఇస్తున్నారు.
అయితే జగన్ ఎన్నికల హామీలపై అధికార తెలుగుదేశం ఇప్పటికే ఎదురుదాడికి దిగింది. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేయలేమని చెప్పిన జగన్ ఇప్పుడు ఇన్ని ఉచిత హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ''రైతు రుణమాఫీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు అని జగన్ గతంలో చెప్పారు. గట్టిగా మూడేళ్లు తిరగకుండానే వాటికి రెట్టింపు ఖర్చు అయ్యే పథకాలు ప్రకటించారు.
అంటే ఈ మూడేళ్లలో రాష్ట్ర ఆదాయం రెట్టింపు అయ్యినట్టేకదా'' అని అధికారపార్టీ నేతలు జగన్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముందే ఊహించే తలకు మించిన పథకాలను ప్రకటించకుండా జగన్ జాగ్రత్తపడ్డారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిసారి కొత్త హామీలతో మాటమార్చేకంటే పాత వాటికే కట్టుబడి గతంలో వైఎస్ ప్రారంభించిన వాటిని సమర్థవంతంగా కొనసాగిస్తానని చెప్పడం ద్వారానే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్న ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే జగన్ ఎన్నికల హామీలు ప్రకటించారని చెబుతున్నారు.