కేంద్రాన్ని మెప్పించిన చంద్రబాబు.!


ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ దెబ్బకి మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తినేశారు. ఈ ప్రాంతంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది ఈ ఎన్‌కౌంటర్‌ కారణంగా. ఒక రోజు కాదు, ముందు రోజు 24 మంది, ఆ తర్వాత నలుగురు, ఆ తర్వాత మరో ఇద్దరు.. మొత్తంగా 30 మంది మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఓ పోలీసు కమాండో కూడా ప్రాణాలు కోల్పోయాడు ఇదే ఎన్‌కౌంటర్‌లో. 

అసలది ఎన్‌కౌంటర్‌ కానే కాదంటూ మావోయిస్టులు అధికారికంగా ప్రకటన చేసేశారు. పోలీసుల వెర్షన్‌ పరమ రొటీన్‌.. ఇది నిఖార్సయిన ఎన్‌కౌంటర్‌ అనీ, లొంగిపొమ్మని చెప్పినా కాల్పులకు దిగడంతో మావోయిస్టులపైకి ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందనీ, ఈ క్రమంలోనే వారిలో చాలామంది చనిపోయారన్నది పోలీసుల వెర్షన్‌. అది బూటకమా.? కాదా.? అన్నది పక్కన పెడితే, మావోయిస్టులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఇంతకీ, ఈ ఎన్‌కౌంటర్‌ వెనుక ఉద్దేశ్యమేంటి.? అని ఆరా తీస్తే చాలా కారణాలే కన్పిస్తాయి. ఛత్తీస్‌గడ్‌ - ఒరిస్సా రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రధాన నగరాలకీ 'లింక్‌' కోసం చంద్రబాబు సర్కార్‌ పలు ప్రత్యామ్నాయాల్ని ఆలోచిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచే ఈ కనెక్టివిటీని పెంచాల్సి వుంటుంది. పైగా, పోలవరం ప్రాజెక్టు సైతం మావోయిస్టుల ప్రాబల్యం వున్న ప్రాంతంలోనే నిర్మితమవుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే కన్పిస్తాయి. 

అన్నిటికీ మించి, బాక్సైట్‌ తవ్వకాలపై చంద్రబాబు సర్కార్‌ అత్యుత్సాహం చూపుతోన్న విషయం విదితమే. సేమ్‌ టు సేమ్‌ ఇదే పొజిషన్‌లో ఒరిస్సా ప్రభుత్వం కూడా వుంది. బాక్సైట్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న ఆదివాసీలకు మావోయిస్టులు అండగా నిలిచారు. అటు బాక్సైట్‌ దోపిడీకి, ఇటు ఇతరత్రా ప్రయోజనాల కోసం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటయ్యాయని చెప్పక తప్పదు. వీటితోపాటుగా, తమ పోలీస్‌ పవర్‌ని కేంద్రానికి చూపించేందుకోసం చంద్రబాబు, అత్యుత్సాహంతో ఓ అడుగు ముందుకేశారనే గుసగుసలూ విన్పిస్తున్నాయి. 

ఆంద్రా ఒరిస్సా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమయ్యింది. ముందుగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిసిందట. అదే సమయంలో, చంద్రబాబుపైనా లోకేష్‌పైనా ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ మావోయిస్టుల పేరుతో ఫేక్‌ లెటర్‌ రావడం గమనార్హం. 

ఇతరత్రా ప్రయోజనాల మాటెలా వున్నా, ఈ ఎన్‌కౌంటర్‌తో కేంద్రం దృష్టిని ఆకర్షించేశారు చంద్రబాబు, దేశంలో ఇంకో ప్రత్యామ్నాయ వ్యవస్థ వుండకూడదన్న కోణంలో కేంద్రం, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ అనీ, ఇంకోటనీ.. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ఎప్పటినుంచో కొనసాగిస్తోంది. అందులో భాగంగానే ఏవోబీ ఎన్‌కౌంటర్‌ కూడా జరిగిందనుకోవచ్చు.

Show comments