అడ్డం పడుతున్నది 'ఒకే ఒక్కడు'

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు.. ఇదే మాట మీద నిలబడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆయన తప్ప, ప్రత్యేక హోదా విషయంలో ఇంకెవరూ అడ్డం కానే కాదు. రాజ్యసభ సాక్షిగా ఈ విషయం ఈ రోజు స్పష్టమయ్యింది. నరేంద్రమోడీని కాదని, బీజేపీలో ఎవరూ ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. 

పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌.. ఇంకా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిథులు, రాజ్యసభ సాక్షిగా నరేంద్రమోడీ సర్కార్‌ని నిలదీశారు.. అదీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని. ఎవరూ పాఠాలు చదివెయ్యలేదు. అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. సభ హామీ ఇచ్చింది, నెరవేర్చి తీరాల్సిందేనన్నది వారి మాట. 'సభలో ప్రధాని ఇచ్చిన మాటకు విలువ లేకపోతే, సభా గౌరవాన్ని కించపర్చినట్లే..' అని వివిధ రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యులు మాట్లాడుతోంటే, బీజేపీ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కన్పించింది. 

ఇక, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ మాట్లాడుతూ, విభజన జరిగిన తీరు గురించి ఏకరువు పెట్టారు. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేయడం తప్ప, రెండేళ్ళలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆ విషయాన్ని పక్కన పెట్టడాన్ని ప్రశ్నిస్తూ ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. ఆసక్తికరమైన విషయమేంటంటే సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి, తెలుగులో మాట్లాడటం. అఫ్‌కోర్స్‌.. సీఎం రమేష్‌ కూడా తెలుగులోనే మాట్లాడారనుకోండి.. అది వేరే విషయం. 

ఏదిఏమైనా, ప్రత్యేక హోదా విషయంలో నరేంద్రమోడీ ఇకపై ఎంతో కాలం తప్పించుకునే పరిస్థితి లేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, జెడియు, కాంగ్రెస్‌.. ఇన్ని పార్టీలు రాజ్యసభలో బీజేపీని నిలదీశాయి. బీజేపీది ఇప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అధికారం వుంది గనుక ఇప్పటికిప్పుడు బుల్‌డోజ్‌ చెయ్యొచ్చుగనుక.. కానీ, ముందు ముందు బీజేపీని ప్రత్యేక హోదా నిలువునా ముంచేయడం ఖాయమే.

Show comments