చంద్రబాబు ఔట్.. జగన్ ఇన్.!

మళ్ళీ అదే మాట.. మళ్ళీ మళ్ళీ అదే మాట.. జగన్‌ నోట ఎక్కడికి వెళ్ళినా, 'ఏడాదిలోనో, రెండేళ్ళలోనో నేను చెప్పలేనుగానీ.. ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది.. మన ప్రభుత్వంలో మనల్ని మనమే బాగు చేసుకుందాం.. చంద్రబాబు పాలన అటకెక్కుతుంది.. ఆ రోజు త్వరగా రావాలని ప్రార్థించండి..' అంటూ జగన్‌ చెబుతూ వస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించినప్పుడూ జగన్‌ ఇవే వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. 

వాస్తవానికి ఇంకో మూడేళ్ళపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అవకాశం వుంది. పదేళ్ళ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి పదవి. దాన్ని వదులుకోవడానికి చంద్రబాబు తనంతట తానుగా ఇప్పట్లో సిద్ధపడే పరిస్థితి లేదు. కానీ, జగన్‌ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు సర్కార్‌ కుప్పకూలిపోతుందని చెబుతున్నారు. ఏంటి జగన్‌కి అంత నమ్మకం.? 

జగన్‌ నమ్మకం సంగతి అటుంచితే, చంద్రబాబులో రోజురోజుకీ అపనమ్మకం పెరిగిపోతోంది. చాలా చేసేస్తున్నాం (ఆయన అలా అనుకుంటున్నారు) అయినా, ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు పెరిగిపోతుంది.? అన్నది చంద్రబాబు ఆవేదన. అవును, చంద్రబాబు చాలానే చేసేశారు. రైతుల రుణాల్ని సగమే మాఫీ చేశారు. డ్వాక్రా మహిళల రుణాల ఊసే ఎత్తలేదు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పి, తాత్కాలిక సచివాలయ నిర్మాణంతో సరిపెట్టేశారు. పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టి, పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేసేశారు. ఇలాంటివి చాలానే వున్నాయ్‌ చెప్పుకోడానికి. 

ఇంకోపక్క, ఎటు చూసినా అవినీతే. రాష్ట్రాని కుదిపేసింది కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ బాగోతం. అంతకన్నా పెద్దది అమరావతి భూ కుంభకోణం. ఇవి చాలవన్నట్లు ఇసుక కుంభకోణాలూ, పచ్చ పార్టీ నేతల అరాచకాలూ ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన పిడుగులా పడ్డాయి. చంద్రబాబు అసమర్థ పాలనని కేంద్రం చూస్తూ ఊరుకుంటోందంటే, ఊరకనే కాదు.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవాలన్న బాధ్యతల నుంచి తప్పుకుంటోంది మరి. దాన్ని చంద్రబాబు నిలదీయకూడదు కదా.! 

అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇది జగన్‌ అంచనా మాత్రమే కాదు, చంద్రబాబు భయం కూడా. ఎందుకంటే, గడచిన రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ని ఎంతగా ఉద్ధరించేశారో, ఆయనకుగాక ఇంకెవరికి బాగా తెలుసుతంది.? నిజంగానే ఉద్ధరించేస్తే, చంద్రబాబు తన మంత్రులకి, ఎమ్మెల్యేలకీ ర్యాంకులు ఇచ్చి, ఆందోళన చెందాల్సిన పనే వుండదు. ఈ సర్వేలు, లెక్కలు బేరీజు వేసుకున్నాకే, చంద్రబాబు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. 

ప్రతిపక్షాన్ని పార్టీ ఫిరాయింపులతో నిర్వీర్యం చేస్తే, 2019 ఎన్నికల వరకూ ఎలాంటి ఇబ్బందీ వుండదనీ, ఆ తర్వాత సంగతి దేవుడెరుగు.. అన్నది చంద్రబాబు ఆలోచన. కానీ, చంద్రబాబు 'వాపు'ని చూసి 'బలుపు' అనుకుంటున్నారు. అక్కడే వస్తోంది చిక్కు అంతా. ఒక్కసారి మధ్యంతరంపై జగన్‌ అంచనాలు నిజమేనని, టీడీపీలో ఎవరికన్నా గట్టిగా అన్పిస్తే.. పేక మేడలా చంద్రబాబు సర్కార్‌ కుప్ప కూలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ మొన్నీమధ్యన చేసిన రాజకీయ శూన్యత గురించి చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు అసమర్థత మీదనేనేమో.! 

చివరగా: చంద్రబాబు తన ప్రభుత్వంపై తానే అనుమానాలు క్రియేట్‌ చేసుకుంటున్నారు. హైటెక్‌ ఆలోచనలని అనుకుంటున్నారుగానీ, ర్యాంకులు ఇచ్చుకోవడం ద్వారా తన ప్రభుత్వం అస్సలేమాత్రం పనిచేయడంలేదన్న సంకేతాల్ని ప్రజల్లోకి పంపుతున్నారు చంద్రబాబు. సూపర్‌ ర్యాంకుల్ని ఇచ్చేస్తేనే జనం నమ్మని పరిస్థితి. అలాంటిది, కొందరు పనిచేయడంలేదని చంద్రబాబే ఒప్పుకుంటే, చంద్రబాబు పాలన ఎలా సాగుతుందన్నదానిపై జనానికి ఓ ఐడియా రాకుండా వుంటుందా.? ఇది అధికార పార్టీలో ముసలం రేపకుండా వుంటుందా.?

Show comments