అంతా ఆల్‌రైట్‌.. షరతులు వర్తిస్తాయ్‌.!

అంతా ఆల్‌ రైట్‌.. కానీ షరతులు వర్తిస్తాయ్‌. అవును, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకున్నారు. అయితే ఆమె ఇంకా ఆసుపత్రి నుంచి ఇప్పట్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాల్లేవు. మరో మూడు నుంచి నాలుగు వారాలపాటు ఆమె ఆసుపత్రిలోనే వుండాల్సి వస్తుందట. అయినప్పటికీ, ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్‌ అవ్వాలన్నది జయలలితే నిర్ణయించుకుంటారట. అపోలో ఆసుపత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి చెప్పిన మాటల సారాంశం ఇదే. 

మామూలుగా అయితే ఎవరన్నా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఎన్నిరోజులు ఆసుపత్రిలో వుండాలనేది వైద్యులు నిర్ణయిస్తారు. కోలుకున్నాక, ఎక్కువ రోజులు ఆసుపత్రిలో వుండేందుకు వైద్యులు అనుమతించరు. కానీ, అక్కడున్నది తమిళనాడు ముఖ్యమంత్రి కదా. అందుకే, ఆమె ఇష్టానికే 'డిశ్చార్జ్‌' నిర్ణయాన్ని వదిలేశారని మనం అర్థం చేసుకోవాలి. 

ప్రస్తుతానికైతే జయలలిత పూర్తిగా కోలుకున్నారట. పరిసరాల్ని గమనిస్తున్నారట, తనకేం కావాలో అడుగుతున్నారట. స్వల్పంగా ఆహారం తీసుకుంటున్నారట. అంటే, ఇన్ని రోజులూ ఆమె స్పృహలో లేరనే కదా అర్థం.? అయినా, ఆమె కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల మీద ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేసేశారు. ఇదెలా కుదురుతుందబ్బా.! 

ఏమో, అంతా మాయ. ఇది తమిళనాడు మాయ. ఓ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు అచేతనావస్థలో ఆసుపత్రిలో వుండడం, ఆమెకు సంబంధించిన శాఖలు ఇంకో మంత్రి నిర్వహిస్తుండడం, క్యాబినెట్‌ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి లేకుండా జరగడం.. ఇదంతా రాజకీయ వైపరీత్యం అనుకోవాలేమో. జయలలిత కోలుకోవాలని పూజలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. అమ్మ అనారోగ్యంతో బాధపడ్తుందన్న ఆవేదన నేపథ్యంలో ఇంకొందరు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారనుకోండి.. అది వేరే విషయం. 

ఏదిఏమైనా, అమ్మ ఆరోగ్యంతో త్వరలోనే తమిళనాడు ప్రజల ముందుకొచ్చే అవకాశముందన్న వార్త అన్నాడీఎంకే వర్గాలకి పెద్ద ఊరటనే ఇచ్చిందనడం నిస్సందేహం. 

Show comments