మర్డర్‌ ఎలా చెయ్యాలంటే...

యంగ్‌ హీరో నిఖిల్‌ తాజా సినిమా 'కేవవ' విడుదలకు ముందే సంచలనాల్ని షురూ చేసేలా వుంది. టీజర్‌తో ఆల్రెడీ షాకిచ్చిన నిఖిల్‌, తాజాగా ట్రైలర్‌తో మరోమారు అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సినిమాలో నిఖిల్‌ పాత్రకి ఓ లోపం వుంటుంది. అదేంటంటే, ఎడమవైపు వుండాల్సిన గుండె అతనికి కుడివైపున వుంటుందట. ఆ కారణంగా, ఎక్కువ ఆవేశానికి లోనవలేడట. ఆటలు కూడా ఆడలేడట. ఏం చేయాలన్నా ప్రశాంతంగానే చెయ్యాలి.. మర్డర్‌తో సహా.. అంటూ నిఖిల్‌ చెప్పే డైలాగ్‌ క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. 

'ట్రైలర్‌ నచ్చడం కాదు అదిరిపోయింది..' అంటూ రాణా, 'కేశవ' ట్రైలర్‌పై స్పందించాడు. ఇండస్ట్రీలో ఇప్పుడీ ట్రైలర్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూల్‌గా మర్డర్స్‌ చేసే పాత్రలో నిఖిల్‌, ఆ కేసుల్ని ఇన్వెస్టిగేషన్‌ చేస్తోన్న పోలీస్‌ అధికారిణిగా ఒకప్పటి హీరోయిన్‌ ఇషా కొప్పికర్‌ నటిస్తున్నారు. నిఖిల్‌ సరసన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అన్నట్టు, ఇషా కొప్పికర్‌ పాత్రకి, బుల్లితెర బ్యూటీ అనసూయ డబ్బింగ్‌ చెప్పడం మరో విశేషం. 

మొత్తమ్మీద, నిఖిల్‌ సినిమా సినిమాకీ ఏదో ఒక కొత్తదనం ఎంచుకుంటూనే వున్నాడన్నమాట. ఈసారి క్రైమ్‌ థ్రిల్లర్‌.. అందులోనూ, 'హార్ట్‌ ప్రాబ్లమ్‌'తో వుండే పాత్రని ఎంచుకోవడం.. వెరసి, నిఖిల్‌ ఇండస్ట్రీ అటెన్షన్‌ని తనవైపుకు తిప్పేసుకున్న దరిమిలా, 'కేశవ' నిఖిల్‌కి మరో హిట్‌ ఇస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments