భూమాను భయపెడుతున్న ఓట్ల లెక్కలు!

ఇప్పుడు రోడ్ షోల్లో ఏడ్చేయడం మొదలుపెట్టింది అఖిలప్రియ. నవ్వుతూనవ్వుతూనే ఏడ్చేస్తోంది.. సానుభూతినే నమ్ముకున్నట్టుగా ఉన్నారు మంత్రిగారు. మరి ఈ కన్నీరు ఓట్లను ఏ మేరకు రాలుస్తుందో తెలియదు కానీ, నంద్యాల ఓట్ల లెక్కలు మాత్రం భూమా వర్గాన్ని భయపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ డెవలప్ మెంట్ నినాదం, సానుభూతి సంగతి ఎలా ఉన్నా.. నంద్యాల ప్రజల ఆటిట్యూడ్ భూమా కుటుంబాన్ని ఎన్నికల్లో ఓడిస్తుందేమో అనే అభిప్రాయం కలగకమానదు.

గత ఎన్నికల ఓట్ల లెక్కలను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. భూమా ఏదైనా ఒక పార్టీలో ఉంటే.. ఆ పార్టీ పట్ల సానుకూలత ఉన్నా, భూమా పట్ల సానుకూలత ఉండదేమో అనే అభిప్రాయం కలుగుతోంది. అందుకు సాక్ష్యం మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. మొన్నటి ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందనేది వేరే చెప్పనక్కర్లేదు.

మరి ఆ సమయంలో కర్నూలు ఎంపీ సీటుతో పాటు నంద్యాల ఎంపీ సీటును, నంద్యాల ఎమ్మెల్యే సీటును వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మరి అప్పుడు పోల్ అయిన ఓట్ల లెక్కలను చూస్తే.. భూమా పట్ల జనాల వైఖరి ఎలా ఉందో అర్థం అవుతుంది. నంద్యాల ఎంపీ సీటులో భాగం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం. మరి ఇక్కడ నుంచి వైకాపా అభ్యర్థి భూమా నాగిరెడ్డి తన సమీప అభ్యర్థి, ప్రధాన ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మీద సాధించిన మెజారిటీ 3,604.

మరి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కి నంద్యాల సెగ్మెంట్లో వచ్చిన మెజారిటీ ఎంతో తెలుసా? అక్షరాలా 16,000 కు పైనే! భూమా పోటీ చేసిందీ వైకాపా తరపునే, ఎస్పీవై పోటీ చేసింది ఒకే వైకాపా తరపునే. ఒకే ఎన్నికల్లో ఒకరు ఎమ్మెల్యే , ఒకరు ఎంపీ. వీరి మధ్య తేడా చాలా తీవ్రంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లోనే బీభత్సమైన క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒకవైపు శోభానాగిరెడ్డి మరణించిందనే సానుభూతి ఉన్నప్పటికీ భూమా నాగిరెడ్డికి ఓటు వేయడానికి చాలా మందికి మనసొప్పలేదు.

ఎంపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వేసినా, ఎమ్మెల్యేగా మాత్రం వైకాపా వారు ఓటు వేయలేదు. ఎమ్మెల్యేగా వారి ఎంపిక శిల్పా మోహన్ రెడ్డి వైపే నిలిచింది. క్రాస్ ఓటింగ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. భూమా విషయంలో ప్రజలు ఏ మేరకు సానుకూలంగా ఉంటారో అప్పుడే స్పష్టం అయ్యింది. అప్పుడూ సానుభూతి ఉన్నా, వ్యతిరేకత తేటతెల్లం అయ్యింది. మరి ఇప్పుడేం జరుగుతుందో!

Show comments