విజయద్వయం: అనితర సాధ్యులు!

కామెడీ జోనర్‌లో.. సరదాగా సాగుతూ ఏదైనా ఒక సినిమా హిట్టయ్యిందంటే, ఆ తర్వాత దాన్ని ఎంతో మంది అనుకరిస్తారు. అది తెలుగు వాళ్లకు వేరే చెప్పాల్సిన అంశం కాదు. ‘ఢీ’, ‘రెడీ’ సినిమాల నాటి ఫార్ములాను ఎన్ని రకాలుగా.. గత పది, పన్నెండేళ్లలో ఎన్నిసార్లు తిప్పి తిప్పి తీశారో, తీస్తున్నారు, తీయబోతున్నారో.. ఈ సినిమాల తీరును గమనిస్తున్న వారందరికీ అవగాహన ఉంది.

ఒక్కటి వస్తే.. దాన్ని ఆధారంగా వంద వస్తున్నాయి. బహుశా... ఆ జోనర్‌లో, ఆ థీమ్‌తో సినిమాలు చుట్టేయడం చాలా ఈజీనేమో! కానీ కొన్ని ఉంటాయి.. అవి ఎంత హిట్ అయినా, అలాంటి సినిమాలు తీయాలంటే మాత్రం మిగతా వాళ్లకు గట్స్ ఉండవు! ఆ తరహా కాన్సెప్టుల జోలికి వెళ్లడానికి కూడా వీళ్లకు ధైర్యం చాలదు. అలాంటి అనితరులు అనుకరించలేని సినిమాల జోడీ ‘‘కమల్ హాసన్- క్రేజీ మోహన్’’.

మర్రి చెట్టు నీడన మరో చెట్టు పెరగడం కుదరదు.. అలాగే కమల్ నీడన ఎంత కష్టపడ్డా, ఎంతటి ప్రతిభావంతులకు కూడా గుర్తింపు దక్కదు! లేకపోతే... క్రేజీ లాంటి హాస్య చక్రవర్తి కమల్‌తో పని చేశాడు చూశారా, అంటూ గుర్తు చేయడం చోద్యమే కదా! ‘‘అపూర్వ సోదరులు’’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘సతీ లీలావతి’, ‘భామనే సత్యభామనే’, ‘తెనాలి’, ‘పంచతంత్రం’, ‘బ్రహ్మచారి’... కమల్ కామెడీ తుఫాన్ల వరస ఇది! తెరల తీరాన్ని తాకి.. నవ్వుల సునామీలను సష్టించి వెళ్లిన సినిమాలు ఇవి! ఇందులో ఎంతమంది ఉన్నా... అందరినీ కమల్ తన నటనతో డ్యామినేట్ చేసేశాడు.. అవతల వారు ఎంత కష్టపడ్డా, కమల్ ముందు వాళ్ల కష్టానికి గుర్తింపు కూడా దక్కలేదు. ఈ క్లాసిక్ కామెడీ సినిమాల్లో నటించడంలోని అదష్టమూ అదే, దురదష్టమూ అదే! అలా వీటన్నింటికీ పని చేసిన అదశ్యశక్తి, హస్య చక్రవర్తే.. ‘క్రేజీ మోహన్’.

ఆ సినిమాలను చూస్తుంటే... కథను బట్టి సీన్లను రాసుకున్నారా?, సీన్లలో హావభావాలకు అనుగుణంగా మాటలు రాశారా? అసలు.. కథకు, సీన్లకు, స్క్రిప్ట్‌కు, మాటలకు.. ఎలా కో ఆర్డినేషన్ కుదిరింది? స్క్రీన్ మీద ఇంత గందరగోళాన్ని సష్టించి నవ్విస్తున్నారంటే... వీటిని పేపర్ మీద ఎంత క్లారిటీతో రాసుకుని ఉండాలి? స్క్రీన్ ప్రజెంటేషన్ మీద ఎంత క్లారిటీ ఉంటే.. వాళ్లు ఈ సీన్లను పేపర్ మీద రాసుకుని ఉండాలి.. అనేది ఆశ్చర్యాలు కలగకమానవు! అందుకే.. అలాంటి సినిమాలు వాళ్లు మాత్రమే చేశారు, అవి హిట్టయినా వాటిని అనుకరించే యత్నాలు కూడా ఎక్కడా జరగలేదు! వాటిని ఎవరైనా రీమేక్ చేసినా.. అవి ఆకట్టుకోలేదు! అలాంటి అనితర సాధ్యులు కమల్, క్రేజీ.

మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మోహన్ రంగాచారి. కాలేజీ రోజుల నుంచి రచనపై మక్కువ. ఇంటర్ కాలేజీ కాంపిటీషన్ కోసం ఈయన రాసిన ‘‘గ్రేట్ బ్యాంక్ రాబరీ’’కి బెస్ట్ ప్లే అవార్డు వచ్చింది. 1972లో కమల్ చేతుల మీదుగా ఆ అవార్డును అందుకున్నాడట. అలా తన చేత అవార్డును అందుకున్న స్టూడెంట్ భవిష్యత్తులో తనతో చాలా సినిమాలకు పని చేస్తాడని కమల్ కూడా ఊహించకపోయి ఉండవచ్చు. ఆ మోహన్ రంగాచారే భవిష్యత్తులో ‘క్రేజీ’ మోహన్‌గా మారాడు.

మోహన్ పేరు వెనుక ఈ ‘‘క్రేజీ’’ చేరడానికి కారణం అతడు రాసిన ఒక నాటకమే. ‘‘క్రేజీ థీవ్స్ ఇన్ పాలవక్కమ్’’ అనే నాటకం సూపర్ హిట్ అయ్యి.. అనేక చోట ప్లే అయ్యి.. ఇతడి పేరు వెనుక ‘‘క్రేజీ’’ని చేర్చింది. ఇతడికి బోలెడంత క్రేజ్‌ను సంపాదించింది పెట్టింది. నాటకాలకు అమితాదరణ ఉన్న రోజుల్లో క్రేజీ మోహన్ కలానికి ఎదురులేకపోయింది.

‘‘క్రేజీ క్రియేషన్స్’’ పేరుతో ఒక ట్రూప్‌ను తయారు చేసుకుని.. తమిళనాడుతో మొదలు, భారతదేశం, భారతదేశం ఆవల కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ దశలో మొత్తం ముప్పై నాటకాలు రాసుకుని.. వాటిని అనేక చోట్ల తాము ప్రదర్శించడంతో పాటు, వేరే ట్రూపులకు కూడా ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చారట. ఈ నాటకాలే క్రేజీని సినిమాలకు పరిచయం చేశాయి. ఈయన రాసిన ‘‘మ్యారేజ్ మేడిన్ సెలూన్’’ నాటకాన్ని ఆధారంగా చేసుకుని కె.బాలచందర్ ఒక సినిమాను రూపొందించాడు. దానికి మూల కథ, మాటల రచయితగా క్రేజీ సినీ ప్రస్థానం మొదలైంది.

దక్షిణాదిన హాస్యాన్నిరాయగల నాటి యువకులను కలుపుకుపోతున్న సమయం అది. ‘‘ఇంద్రుడు చంద్రుడు’’ సినిమాకే తెలుగు వాడైన ఈవీవీ సత్యనారాయణ, క్రేజీ మోహన్‌లు పని చేశారు. భల్లున నవ్వించగలిగే ఆ కామెడీని క్రియేట్ చేశారు. ఈ సినిమా కన్నా ముందు వచ్చిన ‘‘అపూర్వ సోదరర్ గల్’’ ‘మైఖేల్ మదన కామరాజన్’’ సినిమాలకు స్క్రిప్ట్‌లో ఒక చెయ్యి, మాటల విషయంలో రెండు చేతులూ వేశాడు క్రేజీ.

దేశంలో కామెడీని బాగా రాస్తారు, తీస్తారు అనే పేరున్న రచయిత, దర్శకుల్లో జంధ్యాల వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే.. చాలా మంది రచయితలకు విదేశీ సినిమాలే ముడి సరుకు. డేవిడ్ ధావన్, ప్రియదర్శన్‌ల వంటి వారితో మొదలుకుని.. త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకూ అందరి మీదా హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాల ప్రభావం ఉంటుంది. దీనికి క్రేజీమోహన్- కమల్ కాంబో కూడా మినహాయింపు కాదు! వీరు చేసిన సినిమాలన్నీ కూడా.. దాదాపుగా విదేశీ మూలం ఉన్నవే. ఇంద్రుడు చంద్రుడు, తెనాలి, పంచతంత్రం, బ్రహ్మచారి.. ఈ సినిమాల మూలాలన్నీ విదేశాల వారివే. కానీ.. వాటికి మూల పాయింట్‌ను మాత్రమే వాడుకొంటూ, దానికి వీళ్లు చేసిన ట్రీట్‌మెంట్, చూపిన బెటర్‌మెంట్ మాత్రం నిజంగా అద్భుతం!

తెనాలికి మూలం ‘‘వాట్ అబౌట్ బాబ్’’ అనే హాలీవుడ్ సినిమా అనేయొచ్చు. కానీ కాపీయిడ్ వెర్షన్ అని సింపుల్‌గా తేల్చేసే ‘‘తెనాలి’’ని చూశాకా.. ఆ ఆంగ్ల సినిమాను చూస్తే, ఒరిజినల్ మీద గౌరవం పోతుంది! పరమ యాంత్రికంగా ఉండే, కితకితలు పెట్టుకున్నా నవ్వించని ఆ సినిమాను.. సీన్ సీన్‌కూ, మాట మాటకూ.. నవ్వుకునేలా తీర్చిదిద్దిన ఘనత వీళ్లది. ఇలాంటి సినిమాల విషయంలో హాలీవుడ్ వాళ్లు ఆగిపోయిన చోట నుంచి కమల్‌క్రేజీలు మొదలుపెట్టారు. అదరగొట్టేశారు. ‘వాట్ అబౌట్ బాబ్’’కు ఐఎండీబీలో ఉన్న రేటింగ్ 6. పదింటికి ఆ మాత్రం మార్కులే పొందుతుంది అది. కానీ.. దానికి వీళ్లు చేసిన బెటర్‌మెంట్‌కు పడే మార్కులు పదికి పది!

‘పంచతంత్రం’’ సినిమాకు మూలం ఒక అమెరికన్ డార్క్ కామెడీ. అలాంటి సినిమాలను మనోళ్లకు చూపితే వాంతి చేసుకుంటారు. కానీ.. ఆ సినిమాను అత్యంత హద్యంగా వీళ్లు తీర్చిదిద్దిన తీరును చూస్తే... ఈ కాంబో కసరత్తు ఎంత ఉందో అర్థం అవుతుంది.

వీళ్లిద్దరి కాంబినేషన్‌లోని కామెడీ ఎంత ఉందనేది... ఒకసారి చూస్తే అర్థమయ్యేది కాదు! ఒక జోక్ కో, ఒక ఎక్స్ ప్రెషన్ కో, ఒక మాటకో నవ్వుకొంటుండగానే.. అలాంటి మరో అరడజను వెళ్లిపోయి ఉంటాయి, మరోసారి చూసినప్పుడు కానీ వాటిని గుర్తించలేం! చూసిన ప్రతిసారీ వీళ్ల సినిమాల్లో కామెడీలోని కొత్త పంచ్ తగులుతుంది. ఈ కామెడీ సీన్లను పక్కవారికి వివరించడమూ కష్టమే, వాటిని చూడాల్సిందే, నవ్వు ఆపుకోవడానికి కష్టపడాల్సిందే! సౌతిండియా వరకూ కామెడీ విషయంలో హైఎండ్ మోడల్ వీళ్ల రాతలు.

తెర వెనుకే కాదు.. తెరపై కూడా కమల్‌క్రేజీల విన్యాసాలు కొన్ని ఉన్నాయి. దాదాపుగా కమల్ కోసం తను రాసిన సినిమాలన్నింటిలోనూ క్రేజీ ఏదో ఒక పాత్రలో కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి వాటిల్లో ‘‘బ్రహ్మచారి’’ సినిమాలో క్రేజీ చేసిన ఈఎన్టీ స్పెషలిస్ట్ పాత్ర ఒకటి. ‘‘చెవికి సౌండినిపిస్తోంది డాక్టరూ..’’ అంటూ కమల్, ‘‘వినడానికే చెవులు, లేకపోతే చెవుడు..’’ అంటూ క్రేజీ. ఎక్కడా కామెడీ చేయడానికన్నట్టుగా కాదు. వాళ్లు చేస్తూ పోతారంతే.. నవ్వుకుని నవ్వుకుని మనం అలసిపోవాలి. ఆ మధ్య ఒక తెలుగు సినిమాలో బ్రహ్మానందం పాత్రకు ‘‘క్రేజీ మోహన్’’ అని పేరు పెట్టారు.. ఆ పేరుకు ఉన్న కామెడీ క్రేజ్ ఏ స్థాయిలో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

హిందీ సినిమా ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’’ను కమల్ తమిళంలో ‘వసూల్ రాజా ఎంబీబీఎస్’గా రీమేక్ చేయగా.. ఆ సినిమాకు చివరిసారి వీళ్లిద్దరూ పని చేశారు. ఆ సినిమాలో ఒక పాత్ర కూడా చేశాడు క్రేజీ. బహుశా.. వీళ్ల నవ్వుల ప్రవాహం అంతటితో ఆగిపోయేది కాకపోవచ్చు. అడపాదడపా అయినా నవ్వుల చిత్రాలు చేస్తూ ఉంటాడు కమల్. అలాగే ‘పంచతంత్రం’ సినిమాకు సీక్వెల్ ప్రతిపాదన కూడా ఉందంటున్నారు. అలాంటిదే జరిగితే.. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యి నవ్వించే అవకాశాలు ఉన్నాయి!

-జీవన్ రెడ్డి.బి

Show comments