భయం లేదంటే నమ్మేదెలా చంద్రబాబూ.?

'నేనెవరికీ భయపడను..' అన్న మాట చాలా అలవోకగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నోట వచ్చేస్తుంటుంది. ఒకటికి పదిసార్లు కాదు, ఒకటికి వందసార్లు చంద్రబాబు ఆ మాట చెబుతుంటారు. 'నేను నిప్పులాంటోడ్ని..' అని చంద్రబాబు ఎలాగైతేనే చెప్పేసుకుంటారో, 'నేనెవరికీ భయపడను..' అని కూడా అలాగే చెప్పేసుకుంటారు. నిజానికి ఇవి చంద్రబాబుకి ఊతపదాలు. 

పరిస్థితులు ప్రజలకు అర్థమవుతున్నాయి. పార్టీ శ్రేణులకీ అర్థమవుతున్నాయి. కానీ, చంద్రబాబు బుకాయింపులకు మాత్రం హద్దూ అదుపూ లేకుండా పోతోంది. ఒక్కటే ప్రశ్న, హైద్రాబాద్‌ నుంచి విజయవాడకు చంద్రబాబు ఎందుకు మకాం మార్చారు.? అని. దీనికి సమాధానం సింపుల్‌, ఓటుకు నోటు కేసు అని. ఇక్కడ క్లియర్‌ అయిపోవడంలేదూ, భయానికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని.! 

ఓటుకు నోటు కేసు ముందు వరకూ చంద్రబాబు సెక్షన్‌ 8 గురించి మాట్లాడారు.. హైద్రాబాద్‌ మీద తమకు పదేళ్ళు హక్కు వుందని ఇనదించారు. ఆ తర్వాతే కదా మాట మార్చింది.. స్వరాష్ట్రం నుంచి పరిపాలన అని కొత్త పల్లవి అందుకున్నది.! అయినా, చంద్రబాబు భయపడరుగాక భయపడరు. ఇప్పుడు అర్జంటుగా భయానికి మీనింగ్‌ మార్చెయ్యాలేమో.! భయం అంటే ధైర్యం అనీ, ధైర్యం అంటే భయం అనీ, చంద్రబాబు పేరుతో కొత్త డిక్షనరీలు తయారుచెయ్యాలిప్పుడు. 

చంద్రబాబుకి నిజంగానే భయం లేకపోతే, ఓటుకు నోటు కేసుకి అడ్డం పడకూడదు. 'స్టే' తెచ్చుకోకూడదు. అది న్యాయ ప్రక్రియలో ఓ భాగమే కావొచ్చుగాక. కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చిత్తశుద్ధితో కూడిన రాజకీయాలు చేయాలి కదా.! నైతిక విలువల్ని పాటించాలి కదా.! నైతిక విలువలు వేరు, అవకాశాల్ని అందిపుచ్చుకోవడం వేరు. నైతిక విలువల్ని నిరూపించుకోవాలంటే, అవకాశాల్ని పక్కన పెట్టాలి. అదీ ధైర్యమంటే. 

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుకి సంబంధించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం చెప్పేయడంతో టీడీపీ పండగ చేసుకుంది. అక్కడికేదో కేసు విచారణ ఆగిపోతుందన్నట్టు. ఇంకో నాలుగు వారాల్లో చంద్రబాబు బాగోతంపై ఇంకాస్త క్లారిటీ వస్తుంది ఓటుకు నోటు కేసుకు సంబంధించి. అప్పుడు కొత్తగా చంద్రబాబు మళ్ళీ 'స్టే' కోసం ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబుకి భయం లేదా.? చంద్రబాబు చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తున్నారా.? అసలు చంద్రబాబుకి నైతిక విలువలున్నాయా.? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇదీ, చంద్రబాబు జమానా.!

Show comments