నందమూరి బాలకృష్ణ చేసిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి రికార్డులు సృష్టిస్తూ విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. బాలయ్యకు 100వ చిత్రం అనే మైలురాయికి తగిన చిత్రంగా అద్భుతంగా శాతకర్ణి కుదిరిందని ఫ్యాన్స్ మొత్తం పండగ చేసుకుంటున్నారు. శాతకర్ణి జీవితానికి సంబంధించి ఈ చిత్రంలో చూపించిన వివరాలు చారిత్రక వాస్తవాలేనా? కాదా? అనే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. పెద్దగా ఆధారాలు దొరకని ఒక చారిత్రక హీరో జీవితాన్ని సెల్యులాయిడ్ పై చెప్పదలచుకున్నప్పుడు అలాంటి విమర్శలు మామూలే! పైగా కథలో కొన్ని కల్పితాలు ఉన్నాయంటూ దర్శకుడే చెప్పుకున్నాడు కూడా. అంతా బాగానే ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే... శాతకర్ణి నిర్మాతలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను నిలువుదోపిడీ చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
గౌతమీపుత్ర శాతకర్ణి అనేది చారిత్రక హీరోకు సంబంధించిన తెలుగువాడి కథ అంటూ ఎస్టాబ్లిష్ చేశారు. రూపకర్తలు చెప్పుకున్న ఈ వాదనను రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా గౌరవించాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి ముందుగానే 100 శాతం వినోదపు పన్ను మినహాయింపు ప్రకటించింది. నందమూరి బాలయ్యకు స్వయానా బావగారు రాజ్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం తొలుత 75 శాతమే వినోదపు పన్ను మినహాయించగా, బుధవారం నాడు కేబినెట్ భేటీలో.. చంద్రబాబు పరోక్షంలో మంత్రులంతా కలిసి 100 శాతం మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రహసనం కూడా బాగానే ఉంది.
అయితే దోపిడీ జరుగుతున్నది ఎక్కడంటే.. వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం అంటే.. లాజికల్‌గా, సదరు సినిమాను మరింత ఎక్కువ మంది జనం చూడడానికి అందించే ప్రోత్సాహం అన్నమాట. నియమాల ప్రకారం ఈ వినోదపు పన్ను మినహాయింపు అనేది టిక్కెట్ ధరలో తగ్గాలి. తక్కువ ధరకే టికెట్లను విక్రయించాలి. అయితే రెండు తెలుగురాష్ట్రాల్లో ఎక్కడా అలా జరగడం లేదు. యథేచ్ఛగా పాత ధరలకే టికెట్లను విక్రయిస్తున్నారు. అంటే.. ప్రభుత్వం చేకూర్చదలచుకున్న లబ్ధిని ప్రజలకు దక్కనివ్వకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మొత్తాలను మొత్తం స్వాహా చేస్తున్నారన్నమాట.
మరి ఈ పన్ను సొమ్మును థియేటర్ యజమానులే కాజేస్తున్నారా? బయ్యర్లు తింటున్నారా? నిర్మాతలు దోచేస్తున్నారా? అనేది స్పష్టత లేదు గానీ.. మొత్తానికి ప్రభుత్వానికి రావాల్సిన వినోదపు పన్నును వక్రమార్గాల్లో కాజేస్తున్నారని మాత్రం అర్థం అవుతోంది. ఏపీ కేబినెట్ భేటీలో 75 శాతం పన్నును 100కు పెంచాలని మంత్రుల మధ్య చర్చ జరిగినప్పుడు, పన్ను రాయితీ ఇస్తున్నందున థియేటర్లలో టికెట్ ధరలు తగ్గించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజేయకల్లం కూడా స్పష్టంగా చెప్పారు. అయినా దాన్ని ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
రాయితీ పెంపు విషయంలో ‘‘వ్యతిరేకించడమా.. అంత ధైర్యం ఎవరికి ఉంది. నందమూరి వారికి ఎదురువెళ్లే ధైర్యం ఎవరికి ఉంటుంది’’ అంటూ నిస్సిగ్గుగా ప్రకటించిన వెన్నెముక లేని మంత్రులు ఉన్నంత కాలం.. ఇలాంటి దోపిడీని మాత్రం అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలూ తాము ఇచ్చిన రాయితీసొమ్ము విషయంలో సినిమాకు సంబంధించిన వారే స్వాహాచేయడానికి అచ్చోసి వదిలేసినట్లుగా ఉంది.