కమల్‌హాసన్ కోపం తగ్గించుకున్నాడు.. రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నాడు.. అభిమానులతో సమావేశమవుతున్నాడు.. రాజకీయాలపై వారితో చర్చిస్తున్నాడు.! ఏంటీ కమల్‌హాసన్ గురించేనా.? అనుకుంటున్నారా.! అవును, కమల్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. నిన్నగాక మొన్న, కమల్ 'నేను రాజకీయాలకు సరిపడను' అని చెప్పాడు. ఇప్పుడేమో, రాజకీయాలపట్ల ఆసక్తి పెంచుకుని, అభిమానులతో రాజకీయాలకు సంబంధించి మంతనాలు జరుపుతున్నాడు.
ఏమో, కమల్ ఇప్పుడు రాజకీయంగా వేస్తున్న అడుగులు, తమిళనాట ముందు ముందు ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందోగానీ, ప్రస్తుతానికైతే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలే ఓ రేంజ్‌లో అందరికీ విస్మయాన్ని కల్గిస్తున్నాయి. నిజమే మరి, 'నాకు కోపమెక్కువ.. నాలాంటోళ్ళు రాజకీయాల్లో వుండకూదు.. కానీ, నేనూ ఓ పౌరుడ్ని.. ప్రశ్నించడం నా విధి.. ప్రశ్నిస్తాను తప్ప, రాజకీయాల్లోకి రాను..' అంటూ ఈ మధ్యనే జల్లికట్టు వివాదం, తమిళనాడు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేషనల్ మీడియా సాక్షిగా హడావిడి చేసి, కమల్.. ఇప్పుడేమో, రాజకీయాలవైపుగా కీలకమైన అడుగులేస్తుండడంతో ఆశ్చర్యపోకుండా ఎలా వుండగలం.?
కమల్‌హాసన్‌కి ఇప్పుడు తమిళనాడులో 'పొలిటికల్ వాక్యూమ్' కన్పిస్తోంది. అన్నట్టు, ఈ వాక్యూమ్ కమల్ కన్నా రజనీకాంత్‌కే ఎక్కువ కన్పించాలి, కన్పిస్తోంది కూడా. కానీ, రజనీకాంత్ 'సాహసం' చేయలేకపోతున్నాడు. మరో తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్‌ది భిన్నమైన పరిస్థితి. ఆల్రెడీ రాజకీయాల్లో వున్నా, కన్పిస్తున్న పొలిటికల్ వాక్యూమ్‌ని క్యాష్ చేసుకోలేని దుస్థితి ఆయనది. వీళ్ళే కాదు, ఇంకొకాయన కూడా వున్నాడు. ఆయనే అజిత్. జయలలిత వారసుడు అజిత్ అనే ప్రచారం జరిగింది. ఆయనా, రాజకీయాలవైపు కన్నెత్తి చూడటంలేదు జయలలిత మరణం తర్వాత.
సో, ప్రస్తుత పొలిటికల్ వాతావరణాన్ని బట్టి చూస్తే, కమల్‌హాసన్ తమిళ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, 'పొలిటికల్ స్టార్' అయ్యే అవకాశాలు బాగానే కన్పిస్తున్నాయన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ ఈక్వేషన్‌తోనే కమల్, రాజకీయాల వైపు వడివడిగా అడుగులేస్తున్నాడట. తాజాగా కమల్‌తో సమావేశమవుతున్న ఆయన అభిమానులు, 'కమల్ కోపం తగ్గించుకున్నారు..' అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కోపం తగ్గించుకోవడమంటే, రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని అర్థమట. కోడ్ లాంగ్వేజ్ అదిరింది కదూ.!
ఇంతకీ, కోపం తగ్గించుకున్నాడు సరే, కమల్ - తమిళ రాజకీయ తెరపై వెలిగిపోతారా.? వేచి చూడాల్సిందే.