నరేంద్రమోడీ.. ప్రపంచ యోగా గురు

ప్రపంచానికి యోగాని పరిచయం చేసిందెవరు.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల నుంచి యోగా పుట్టిందన్నది నిర్వివాదాంశం. యోగా గురించి చాలా కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. అయితే, యోగా అనేది కేవలం హిందూ మతానికి సంబంధించిన విషయంగా చాలామంది లైట్‌ తీసుకున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు, మన దేశంలోనే 'యోగా చెయ్యడం ఇస్లామిక్‌ సంప్రదాయాలకు విరుద్ధం' అంటూ ఫత్వాలు జారీ చేసిన సందర్భాలున్నాయి. 

ఇప్పుడిప్పుడే ప్రపంచం యోగా ప్రాముఖ్యతను తెలుసుకుంటోంది. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ వంటి అనారోగ్య సమస్యలకు యోగాతో చెక్‌ పెట్టవచ్చని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారిప్పుడు. యోగాతో మానసిక ఉల్లాసం కలుగుతుందనీ, అది సకల రోగాలకూ నివారిణిలా పనిచేస్తుందనీ చెప్పని డాక్టర్‌ లేరు. ఉరుకులు పరుగుల జీవితంలో, కాస్సేపు మానసికోల్లాసం కరువైపోయిందన్నది నిర్వివాదాంశం. ఆ కారణంగానే, యోగా తమ జీవన విధానంలో ఒకటిగా మార్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. 

ఇక, నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక.. ప్రపంచ వ్యాప్తంగా యోగాకి గుర్తింపు మరింత పెరిగింది. జనవరి 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో 'యోగా' కోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. ఇస్లామిక్‌ దేశాలు సైతం, ప్రపంచ యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుండడం గమనార్హం. చిత్రంగా, ఈ యోగా దినోత్సవానికి ఆయా దేశాల్లోని క్యాన్సర్‌ సొసైటీలు, హార్ట్‌ సొసైటీలు.. ఇలా పలు సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో గత ఏడాదిలానే, ఈసారి కూడా యోగా దినోత్సవం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. గత ఏడాది యోగా దినోత్సవ నిర్వహణ కోసం కోట్లు ఖర్చు చేయడం వివాదాస్పదమయినా, ఈసారి గతంలోకన్నా పెద్ద సంఖ్యలో 'యోగా' ప్రియులు ఈ వేడుకను తిలకించేందుకు సమాయత్తమవుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ముఖ్య నగరాల్లో ప్రత్యేకంగా రేపు యోగా దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. 

బంచిక్‌ బంచిక్‌ చెయ్యి యోగా.. ఒంటికి యోగా మంచిదేగా.. అంటూ ప్రపంచమంతా రేపు యోగా దినోత్సవ వేడుకల్లో మునిగి తేలనుంది. ఒక్కటి మాత్రం నిజం. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌.. ఇలా కొన్ని అనారోగ్య సమస్యలకు యోగా చక్కని ఉపాయం. చిన్నప్పటినుంచే యోగా దినచర్యలో భాగమైతే, సమాజాన్ని భయకంపితుల్ని చేస్తున్న అనేకానేక రోగాలకు చెక్‌ పెట్టగలం. ప్రపంచంలోని వివిధ దేశాలే యోగా పట్ల ఆసక్తి చూపుతున్నప్పుడు, అది మన జాతి సంపద.. దాని విషయంలో మనమెందుకు నిర్లక్ష్యం వహించడం.?

Show comments