కులాల్లేవ్‌.. రిజర్వేషన్లు ఎత్తేయండిక

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఓ మంచి మాట చెప్పారు. కులాలకు అసలు ప్రాతిపదిక లేదనీ, ప్రస్తుత పరిస్థితుల్లో కులాల గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదనీ, కులం కన్నా గుణం మిన్న అనీ సెలవిచ్చారాయన. నిజమే, ఇంకా ఈ రోజుల్లోనూ కులాల గురించి కొట్టుకోవడం హాస్యాస్పదమే. కానీ, ఏం చేస్తాం.? కులాల కుంపట్లు రగులుతూనే వున్నాయి.. కులాల పేరుతో ఓటు బ్యాంకుల్ని కొల్లగొడుతూనే వున్నారు.. కులం పేరు చెప్పి రాజకీయాలు చేస్తూనే వున్నారు. 

ఫలానా నియోజకవర్గంలో ఫలానా సామాజిక వర్గానికి టిక్కెట్‌ ఇస్తే తప్ప గెలవలేం.. అనుకోని రాజకీయ పార్టీ ఎక్కడా కనిపించదు. కులం కుళ్ళురా.. అనేవాళ్ళంతా, ఆ కులాన్ని పట్టుకుని వేలాడేవారే. వేదికలెక్కి ప్రసంగాలు చేసేటప్పుడు మాత్రమే, నాయకులకి 'కులం కుళ్ళు' అనే విషయం గుర్తుకొస్తుంటుంది. వెంకయ్యనాయుడు ఇందుకు మినహాయింపేమీ కాదు. 

అసలు కులం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదన్న వెంకయ్యనాయుడు మాటలే నిజమైతే, కులాల పేరుతో వున్న రిజర్వేషన్లను ఎత్తేస్తాం.. అని ఆయన చెప్పగలరా.? చినజీయర్‌స్వామి షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు కులం గురించి గొప్పగా లెక్చర్లు దంచేశారుగానీ, బీజేపీ మీద 'మతతత్వ పార్టీ' అనే మచ్చ గురించి ఏం సమాధామిస్తారు.? 

కేసీఆర్‌ రాజు కాదు.. కానీ, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.. నరేంద్రమోడీ రాజు కాదు, ఆయనా ప్రధాని అయ్యారు.. అంటూ వెంకయ్యనాయుడు వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. రాజులు, రాజ్యాలు ఎప్పుడో పోయాయ్‌. మనది ప్రజాస్వామ్య భారతం.. రిజర్వేషన్ల చుట్టూ పిల్లి మొగ్గలు వేస్తున్న ప్రజాస్వామ్య భారతం. ఆ రిజర్వేషన్లే చాలా కులాలకి చట్ట సభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తున్నాయి. ఇవన్నీ సీనియర్‌ పొలిటీషియన్‌ వెంకయ్య మర్చిపోతే ఎలా.? Readmore!

Show comments