బాలయ్యా.. భలేవాడివయ్యా.!

'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాని తెలుగు జాతి ఆత్మగౌరవంగా ప్రకటించేసుకున్నారు అప్పట్లో. అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయానికి చారిత్రక నేపథ్యమున్న సినిమాని తెరకెక్కించడం ఆషామాషీ విషయమేమీ కాదు. ఆ విషయంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా టీమ్‌ని అభినందించాల్సిందే. కానీ, 'తెలుగు జాతి ఆత్మగౌరవం' అంటూ అప్పట్లో చేసిన 'యాగీ' ఒకింత ఇబ్బందికరంగానే మారింది.

పైగా, ఆ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకి వినోదపు పన్ను రాయితీ కల్పించడం కూడా వివాదాస్పదమయ్యింది. సాక్షాత్తూ ఏపీ మాజీ సీఎస్‌ ఐవీఆర్‌ కృష్ణారావు 'రాయితీ'పై మండిపడ్డారు కూడా. చరిత్రని పూర్తిగా అర్థం చేసుకోకుండా, అడ్డదిడ్డంగా 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాని తెరకెక్కించారనే విమర్శలు కోకొల్లలుగా వచ్చిపడ్డాయి.

ఎలాగైతేనేం, 'గౌతమి పుత్ర శాతకర్ణి' తెలుగులో మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడీ సినిమా తమిళంలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు జాతి ఆత్మగౌరవం.. అంటూ ఇక్కడ పబ్లిసిటీ ఊదరగొట్టేసిన హీరో బాలకృష్ణ, తమిళనాడుకి వెళ్ళగానే స్వరం మార్చేశారు. 'ఇది భారతీయ సినిమా..' అంటూ కొత్త పల్లవి అందుకున్నారాయన. అంతేనా, 'తమిళనాడు నాకు పురిటిగడ్డ.. నేను ఇక్కడే జన్మించాను..' అంటూ అరవంలో డైలాగులు దంచి కొట్టేశారు. 

డబ్బింగ్‌ సినిమాలకొచ్చేసరికి తమిళం నుంచి తెలుగులోకి ఎలా డబ్‌ చేస్తారో, అలాగే ఊళ్ళ పేర్లు, రాష్ట్రాల పేర్లూ అలాగే తర్జుమా చేసేస్తారు. చెన్నయ్‌ కాస్తా హైద్రాబాద్‌ అయిపోతుంది. తమిళం బోర్డు, తెలుగులో పేరు మాత్రం ఏ విశాఖపట్నం అనో వుంటుంది. ఇవన్నీ మామూలే. అయితే, ఆత్మగౌరవం.. అంటూ తెలుగు సెంటిమెంట్‌ని ఇక్కడ వర్కవుట్‌ చేసినట్లు, 'గౌతమి పుత్ర శాతకర్ణి' టీమ్‌, తమిళ ఆత్మగౌరవం.. అని అక్కడ అంటుందా.? అనేలానే వుంది, బాలయ్య ప్లేటు ఫిరాయించెయ్యలేదా.. తమిళనాడు - పురిటిగడ్డ అని.!

Show comments