2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం విదితమే. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీ కోసం, కదల్లేని పరిస్థితుల్లోనూ ఇంట్లోని బెడ్ మీద నుంచి ప్రచారమైతే చేశాడుగానీ, టీడీపీ గట్టెక్కలేకపోయింది ఆ ఎన్నికల్లో. అఫ్‌కోర్స్, ఆ తర్వాత ఎన్టీఆర్‌ని టీడీపీ వదిలించుకుందనుకోండి.. అది వేరే విషయం.
టీడీపీని ఉద్ధరించేద్దామని అనుకున్నాడుగానీ, తన ప్రాణమ్మీదకు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అది ఎన్టీఆర్ జీవితంలో అతి పెద్ద గుణపాఠం అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇక, అప్పట్లో ఎన్టీఆర్ సన్నిహితుల లిస్ట్‌లో కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి పేరు కూడా వుండేది. కమెడియన్ రఘు, విలక్షణ నటుడు రాజీవ్ కనకాల లాంటివారంతా అప్పట్లో ఎన్టీఆర్ గ్యాంగ్‌లా వుండేవారు. ఆ గ్యాంగ్ ఇప్పుడు ఎన్టీఆర్ వెంట లేదు. కారణాలేవైనా, ఆ ఘటనతో ఎన్టీఆర్‌కి శ్రీనివాస్‌రెడ్డి దూరమయ్యాడు. దానికి కారణ తాజాగా వెల్లడించాడు శ్రీనివాస్‌రెడ్డి.
తన గురించి కొందరు చెడుగా చెప్పడంతో అప్పటినుంచీ ఇప్పటిదాకా ఎన్టీఆర్ తనను దగ్గరకు చేరనివ్వలేదంటూ ఆనాటి ఆ ఘటనను వివరించాడు. తన తాజా చిత్రం 'జయమ్ము నిశ్చయమ్మురా' ప్రమోషన్‌లో శ్రీనివాస్‌రెడ్డి పెదవివిప్పాడు. చిత్రమైన విషయమే ఇది. ఎన్టీఆర్‌ని కలిసి పరిస్థితుల్ని వివరిస్తాననీ, అతను అర్థం చేసుకుంటాడనే నమ్మకం తనకుందనీ శ్రీనివాస్‌రెడ్డి చెప్పుకొచ్చాడు. అంత నమ్మకమే వుంటే, ఆ పరిస్థితుల్ని వివరించడానికి ఏడేళ్ళకుపైగా ఎందుకు సమయం పట్టినట్లు.?
మొత్తమ్మీద, 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా కోసం శ్రీనివాస్‌రెడ్డి ఎన్టీఆర్‌ని కూడా వాడేసుకున్నాడన్నమాట. మరి, ఎన్టీఆర్, శ్రీనివాస్‌రెడ్డిని అర్థం చేసుకుంటాడా.? వేచి చూడాల్సిందే.