యూపీ ఫలితాలు.. ఫైనల్ ప్రిడిక్షన్స్ ఏం చెబుతున్నాయి?

యూపీ నాడి ఎలా ఉందో తేలడానికి మరెంతో సమయంలేదు. సుధీర్ఘంగా... విడతల వారీగా జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరి మామూలుగా అయితే పోలింగ్ అంతా పూర్తి అయిన కొన్ని గంటల్లోనే ఎగ్జిట్ పోల్ సర్వేలు హల్ చల్ చేయాల్సింది. అయితే.. నేటి సాయంత్రం వరకూ ఎగ్జిట్ పోల్ సర్వేలపై నిషేధం పెట్టింది ఈసీ. పోలింగ్ ముగిసినప్పటికి.. కొన్ని చోట్ల రీ పోలింగ్ లను దృష్టిలో ఉంచుకుని తొమ్మిదో తేదీ సాయంత్రం వరకూ ఎగ్జిట్ పోల్ సర్వేలను ఈసీ నిషేధించింది.

అయితే... వార్తా చానళ్లు తమ ముందస్తు అంచనాలను మాత్రం వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అనే పదం వాడకుండా... ప్రీ పోల్ సర్వే అనే మాటతో ఆంగ్ల,  హిందీ వార్తా చానళ్ల విశ్లేషకులు అంచనాలను వెల్లడిస్తున్నారు. అయితే.. వీటి మధ్య ఏకీభావం లేదు. ఒకరు బీజేపీకి నూటా తొంభై సీట్లు అంటుంటే.. మరొకరు ఇన్నే సీట్లు కాంగ్రెస్ ఎస్పీలకు దక్కుతాయని వాదిస్తున్నారు. పరస్పర విరుద్ధ భావాలే వ్యక్తం అవుతున్నాయి ఈ అంచనాల్లో. 

అయితే స్పష్టమైన మెజారిటీ మాత్రం ఎవ్వరికీరాదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఎవరుగెలిచినా వారికి రెండు వందలకు దగ్గరదగ్గరగా సీట్లు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే.. యూపీ విషయంలో పొలిటికల్ పండిట్ల మాటలకు విలువ ఎప్పుడూ దక్కడంలేదు. ఐదేళ్లకిందటి ఎలక్షన్ల విషయంలోనూ, అంతకు ముందు ఎలక్షన్ల సమయంలోనూ విశ్లేషకుల అంచనాలు అడ్డం తిరిగాయి. క్రితంసారి ఎస్పీ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

మాయవతి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలామంది విశ్లేషకులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలు అడ్డం తిరిగాయి. అంతకు ముందు ఎన్నికల విషయంలో కూడా.. మాయవతి బంపర్ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇలా అంచనాలకు భిన్నంగా వస్తున్న యూపీ ఫలితాల్లో... ఈసారి విశ్లేషకులకే స్పష్టత లేకుండా పోయింది. ఒకే చానల్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టులు ఒకే చర్చా కార్యక్రమంలో కూర్చుని.. పరస్పర  విరుద్దమైన అంచనాలను వెల్లడిస్తున్నారు.

మరి ఎవరి అంచనాలు కరెక్ట్ అవుతాయో మరో నలభై ఎనిమిది గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేటి సాయంత్రం వివిధ చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయనున్నాయి. మరి వీళ్ల సంగతిని పక్కన పెట్టి.. జ్యోతీష్యులను సంప్రదిస్తే మాత్రం విజయం.. ఎస్పీ కాంగ్రెస్ కూటమిదే అని ఒక జ్యోతీష్యుడు చెప్పారు. మరి ఎవరి నోటి వాక్కుకు పవర్ ఉందో..!

Show comments