ప్రత్యేక హోదా వచ్చే ఏడాది (2017) మార్చ్ నుంచి ఏ రాష్ట్రానికీ వుండదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెబుతున్నారు. ఇదే మాట, పలువురు కేంద్ర మంత్రులు సెలవిస్తోన్న విషయం విదితమే. అసలు, దేశంలోనే ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వుండదు గనుక, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదన్నది కేంద్రం చెబుతున్న మాట.
ఇది నిజమేనా.? అసలు, దేశంలో ఇప్పటిదాకా ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు ఇకపై ప్రత్యేక హోదా వుండదా.? ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందా.? అసలు అది సాధ్యమేనా.? దేశవ్యాప్తంగా కాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ ప్రశ్నలు అందరి మదిలోనూ మెదులుతున్నాయి. ఇక, ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాల్లో అయితే, 'తీసెయ్యమనండి చూద్దాం.. ఆ తర్వాత ఏం జరుగుతుందో..' అంటున్నారు అక్కడి ప్రజానీకం.
ఏదో ఆషామాషీగా ఆయా రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కేంద్రం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యానే ఎప్పటినుంచో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సంక్రమించింది. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమైనది దేశ సరిహద్దుల్లో వుండడం. దానికి తోడు, వెనుకబాటుతనం.. ఇంకా చాలా చాలా అంశాలున్నాయి. ప్రత్యేక హోదా వున్నా, ఆయా రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడే వుండడం గమనార్హం.
అదిగో, ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదుగనుక, అది ఆంధ్రప్రదేశ్‌కి అనవసరం.. అన్నది కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ చెబుతున్న కొత్త మాట. ఆ బుద్ధి లేకనే వెంకయ్యనాయుడు పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించారా.? అని ఎవరైనా అడిగితే, 'అప్పుడు మీకు నేను తప్ప ఇంకెవరూ దిక్కులేదు..' అని వెంకయ్య వెటకారం చేయడం చూస్తూనే వున్నాం.
ఏదిఏమైనా, కేంద్రం చెప్పినంత వీజీ కాదు, ప్రత్యేక హోదా తీసెయ్యడం. అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్‌లా వుండవు కదా. అన్ని రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లోలా చేవలేని ప్రజా ప్రతినిథులు వుండరు కదా.! ప్రత్యేక హోదా అనే తేనె తుట్టెను కదిలిస్తే, తద్వారా తలెత్తే ఆందోళనల పర్వం నరేంద్రమోడీ సర్కార్ పునాదుల్ని కదిలించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.