తమ్ముళ్లు తన్నుకుంటున్నారు మళ్లీ మళ్లీ..!

అనంతపురం జిల్లా తెలుగుదేశంలో విబేధాలకు కొదవేమీ లేదు. ఏ ఒక్కరికీ మరొకరంటే పడదు! పక్క పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అయినా సరే.. వీళ్లంతా ఉప్పూనిప్పుల్లా మెలుగుతున్నారు. ఇలాంటి వారి మధ్య తరచూ వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. వీళ్ల తన్నులా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి గొడవలకు మజిలీ జిల్లాలోని ధర్మవర్గం నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్లే రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గాల మధ్య జరుగుతున్న గొడవ ఇది. ఇది వరకూ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఈ రెండు వర్గాలూ శాయశక్తులా తన్నుకున్నాయి. 

ధర్మవరం టౌన్లో తమ ఫ్లెక్సీలు ఉండాలనేది పరిటాల వర్గం కోరిక,  ఈ నియోజకవర్గంతో మీకేం సంబంధం అనేది వరదాపురం వాదన. ఫలితంగా వీళ్లిద్దరూ కుమ్మేసుకున్నారామధ్య. ఆఖరికి పోలీసులు జోక్యం చేసుకుని 144 సెక్షన్‌ పెట్టి వివాదాన్ని పరిష్కరించాల్సి వచ్చింది. ఇదంతా జరిగి కొంత కాలం అయ్యింది.

అయితే తాజాగా పరిటాల రవి వర్ధంతి సందర్భంగా తమ్ముళ్లు మరోసారి కొట్టేసుకున్నారు. పోలీసులు మళ్లీ 144 సెక్షన్‌ పెట్టాల్సి వచ్చింది. దీపావళి- దసరా సమయంలో ఒకసారి ఫ్లెక్సీల వార్‌ జరగగా, పరిటాల వర్ధంతి సందర్భంగా మరోసారి రచ్చ జరిగింది! ఈసారి కూడా పరిటాల వర్గాన్ని ఎంటర్‌టైన్‌ చేయలేదు వరదాపురం వర్గం. మరి ఎక్కడెక్కడి తెలుగుదేశం వాళ్లో పరిటాలను తెగ అభిమానించేస్తూ ఉంటారు, పరిటాల ఊరూ, మాట ఎరగని వాళ్లు కూడా తాము రవి అభిమానులం అని చొక్కాలు చించేసుకొంటూ ఉంటారు.

అయితే సొంత కులస్తుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన వరదాపురం సూరి మాత్రం పరిటాల పేరెత్తితే కస్సుమంటున్నాడు. ఆ ఊసు తన నియోజకవర్గంలో వినిపించకూడదని అంటున్నాడు. తను శాంతికాముకుడిని అని, పరిటాల పేరు తన నియోజకవర్గంలో వినిపించకూడదని, అలాంటి పేర్లు చెప్పి దందాలు చేయడానికి వీలు లేదని వరదాపురం సూరి స్పష్టం చేస్తున్నాడు. అలాగే తమ నియోజకవర్గంలో పరిటాల వర్గం ఉనికి కూడా ఉండకూడదని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

అయితే ధర్మవర్మం నియోజకవర్గం మాది.. అని సునీత ఇప్పటికే చెప్పేసింది. అక్కడ పార్టీ నిలదొక్కుకోవడానికి కారణం తన భర్త అని ఆమె అంటోంది. ఇప్పుడు ఎవరెవరో వచ్చి అక్కడ అధికారం చెలాయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్కడ తాము చెప్పిందే జరగాలని ఆమె కోరుకొంటున్నట్టుగా ఉన్నారు. పరిటాల వర్గానికి ధర్మవరంలో సూదిమొన మోపడానికి కూడా స్థానం ఇవ్వనని వరదాపురం స్పష్టం చేస్తున్నారు. ఈ పరంపరలో ఇప్పటి వరకూ రెండుసార్లు 144 సెక్షన్‌ వరకూ వచ్చింది పరిస్థితి. మరి వీళ్ల అంతర్గత కలహాలు జనాలను బాగా విసిగించేస్తున్నాయి. ఈలొల్లి ఎక్కువైతే ఓవరాల్‌గా తెలుగుదేశం పార్టీకే తిరస్కరణ ఎదురుకావొచ్చు సుమా!

Show comments