కిరణ్ జనసేనలోకి.. ఇదో కామెడీ..!

జనాలు కిరణ్ కుమార్ రెడ్డిని ఎప్పుడో మరిచిపోయారు.. అయితే మీడియా మాత్రం అప్పుడప్పుడు ఆయన్ను తెరపైకి తెస్తుంటుంది. తెలుగుదేశంలో చేరబోతున్నాడని ఒకసారి, కాదు కాదు... బీజేపీలో అని మరోసారి. ఇప్పుడు కొత్తగా జనసేనలోకి కిరణ్ అనే ప్రచారం మొదలుపెట్టారు. ఎవరికో ఈ ఆలోచన వస్తుంది. వాళ్లు రాస్తారు.. వాళ్లను చూసి.. అర్రీబుర్రీ సైట్లన్నీ అందుకొంటూ ఉంటాయి.

ఇక గొంతేసుకుని పడిపోయే.. యూట్యూబ్ చానళ్లు మరోవైపు. వీటన్నింటినీ అమాయకంగా నమ్మేసే వాళ్లు కిరణ్ కుమార్ రెడ్డి జనసేనలో చేరబోతున్నాడట.. అంటూ చర్చించుకొంటూ ఉన్నారు. మరి ఇది నిజంగా నిజమేనా? అస్సలు జరిగే పనేనా? అని కాస్తా ఆలోచించి, కొంచెం ఆరాతీస్తే కానీ అసలు విషయం అర్థంకాదు. 

కిరణ్ జనసేనలో చేరడం అనేది కేవలం పుకారు మాత్రమే. కిరణ్ ఈ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు.. ఇది జరిగేపని కూడా కాదు. అసలు జనసేన అనే పార్టీకి తాడూ బొంగరంలేదు ఇప్పటి వరకూ. దానికి ఒక విధీవిధానం లేదు. తెలుగుదేశానికి వ్యతిరేకమా? అనుకూలమా? అనే కీలకమైన మేటర్ లోనే జనసేన అధినేత ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. మరిలాంటి పార్టీలోకి ఎవరైనా చేరే అవకాశం ఉందా? అనేది మొదటి ప్రశ్న. ఏ బోండా ఉమానో, గంటా శ్రీనివాసరావో చేరతాడు అంటే అదోలెక్క.

కానీ, కిరణ్ ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆల్రెడీ కొంతవరకూ పరువు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు జనసేన వంటి పార్టీలోకి చేరి బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే దాన్ని కూడా పోగొట్టుకుంటాడా? తెలుగుదేశం పార్టీలోకి కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కానీ చేరడానికే కిరణ్ సమ్మతంతో లేడు.

ఎందుకంటే.. ఆ పార్టీల్లో దేంట్లోకి చేరినా చంద్రబాబు కిందో, వైఎస్ జగన్ కిందో పని చేయాలి. ఆ పార్టీల్లో వాళ్లే ముఖ్యమంత్రి అభ్యర్థులు.. అధినేతలు. అలాంటి చోటకు వెళ్లి వాళ్ల కింద పని చేయడానికి, వాళ్లను ‘మా నాయకుడు’ అనడానికి కిరణ్ నేపథ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. 

సొంత నియోజకవర్గంలో తమ్ముడిని గెలిపించుకోలేకపోవచ్చు.. కానీ మాజీ ముఖ్యమంత్రి అనే హోదా ఉంది కదా.. అలాంటి వ్యక్తి వెళ్లి చంద్రబాబు కిందో, జగన్ కిందో ఎలా పని చేస్తాడు? అందుకే గత మూడేళ్ల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి తాపీగా బెంగళూరులో రెస్టు తీసుకొంటున్నాడు. తన వ్యాపారాలు చేసుకొంటున్నాడు.

చంద్రబాబు, జగన్ ల కింద పనిచేయడానికే కిరణ్ వ్యక్తిత్వం, అహం ఒప్పుకోవు. అలాంటిది పవన్ కల్యాణ్ కిందకొచ్చి.. పనిచేస్తాడు.. అనుకోవడానికి మించిన అమాయకత్వం మరోటి ఉండదు. పవన్ పార్టీ హైప్ తీసుకురావడానికి.. మరే అవకాశం లేక, కిరణ్ చేరుతున్నాడు.. అని ప్రచారం చేసుకొంటూ ఉన్నట్టున్నారు.

 ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ గా యాక్టివేట్ కావాలని అనుకుంటే.. దానికి వేదిక ఏదైనా జాతీయ పార్టీనే కావాలి. కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో చేరితే మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ వార్తల్లోకి రాగలడు. ఆ పార్టీల్లో అయితే.. ఎవరికి వారే బాసులు అన్నట్టుగా ఉంటుంది.

అంతా కలిసి ఢిల్లీ పెద్దలకు దాసులు.. అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అలాంటి పార్టీల్లో కిరణ్ చేరే అవకాశాలు కొంత వరకూ ఉన్నాయి. కాంగ్రెస్ లో అయితే చేరినా ప్రస్తుతానికి ఉపయోగం ఏమీలేదు, బీజేపీలో కిరణ్ చేరికకు కొందరు గట్టిగా అడ్డుపడుతున్నారు. దీంతోనే ఈ మాజీ ముఖ్యమంత్రి సైలెంట్ గా ఉన్నాడు.

Show comments