అన్నన్నా.. హజారే జీ, మీకిది భావ్యమేనా..?

అసలు మీరు.. అరవింద్ కేజ్రీవాల్ ‘రాజకీయ పార్టీని స్థాపిస్తాను’ అన్నప్పుడే.. అతడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు! అవినీతి వ్యతిరేక దీక్షలో నాతో కలిసి కేజ్రీవాల్ కూర్చుని ఉండవచ్చు గాక.. నా పేరును, నా ఇమేజ్ ను కేజ్రీవాల్ తన రాజకీయ పార్టీకి వాడుకోవడానికి ఏమాత్రం వీల్లేదు.. అని మీరు ఆ  రోజే స్పష్టం చేశారు! అయినా కేజ్రీవాల్ తో సహా ఎవరూ బాధపడలేదు. 

కేజ్రీవాల్ ప్రజలను నమ్ముకున్నాడు, కేజ్రీని ప్రజలు నమ్మారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లతో విసిగి వేసారిన ఢిల్లీ ప్రజలు.. సంచలన స్థాయి తీర్పును ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దేశ చరిత్రలో రాజకీయ సంచలనాన్ని సృష్టించారు ఢిల్లీ ప్రజలు. అప్పుడు మీరు కూడా  ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు  తెలిపారు. అంతా ఆనందించారు.

మరి ఇప్పుడేమంటున్నారు.. ఒకప్పటి కేజ్రీవాల్ వేరు, ఇప్పటి కేజ్రీవాల్ వేరు అందురా! కేజ్రీతో నాకు సంబంధం లేదు అని ఆప్ ఆవిర్భావం అప్పుడే ప్రకటించిన మీరు.. ఏం పోలిక పెడుతున్నారో అర్థం కావడం లేదు. లోక్ పాల్ బిల్లు కోసం పోరాడిన కేజ్రీవాల్- ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కు పోలిక పెడుతున్నారా లేక దాదాపు రెండేళ్ల కిందట ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేజ్రీవాల్ కు- ప్రస్తుత కేజ్రీవాల్ కు పోలిక పెడుతున్నారా!

ఒక రకంగా చూస్తే.. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడో విశ్వాసంలోకి తీసుకోవడం మానేశారు. ఆ తర్వాత ప్రజల విశ్వాసంతో అతడు గెలిచి నిలిచాడు!

యూ టూ బ్రూటస్.. అని సీజర్ చక్రవర్తి ఖిన్నుడైనట్టుగా.. మీ విమర్శలతో కేజ్రీవాల్ బాధపడుతూ ఉండవచ్చు. ఇంతకీ కేజ్రీ చేసిన పాపం ఏమిటి? వివాదాల్లో చిక్కుకున్న తన మంత్రులను, తన పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, బహిష్కరించడమా? వాళ్లు వివాదాల్లో చిక్కున్న విషయాన్ని ఎవరూ కాదనడం లేదు.. అవి వ్యక్తిగతమైనవా, సమాజానికి హాని చేసేవా.. నైతికంగా పతనమైనవా.. అనే విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ సమాజం ఆ ఆప్ నేతలను దుష్టులుగా తేల్చింది. కేజ్రీవాల్ కూడా అందరి మాటకే  విలువనిచ్చాడు. వివాదాల్లో ఇరుక్కున్న తన పార్టీ నేతలపై చర్యలు తీసుకొంటూ వస్తున్నాడు!

మరి అదే అతడి పాపం అయిపోయింది పాపం! మీడియా వర్గాలో , బీజేపీ నేతలో ఈ విషయంలో కేజ్రీపై విరుచుకుపడుతుండుంటే దాన్ని  ఎవరూ పట్టించుకునే వారు కాదు.. హాజారే జీ, మీరు కూడా ఇలా మాట్లాడుతుండటమే చోద్యం.

హాజారే జీ.. మీరు అవినీతి వ్యతిరేక పోరాటం మొదలుపెట్టినప్పుడు, అన్నాకు తమ్ముళ్లం అంటూ జాతీయ జెండాను భుజాన వేసుకుని హైదరాబాద్ లో అనుకూల పత్రికాఫీసు వరకూ  పాదయాత్ర చేసిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారో… మీకు అనుకూలంగా ఫస్ట్ పేజీల్లో ఎడిటోరియల్స్ రాసేసిన వాళ్లు ఇప్పుడేం రాస్తున్నారో ఇక్కడి ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు. 

దేశంలో ముఖ్యమంత్రి, పాలకుడు కేజ్రీ ఒక్కడే మాత్రమే కాదు…మోడీ తో సహా మంత్రులు, అన్ని రాష్ట్రాలకూ ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్లంతా సత్యహరిశ్చంద్రులు అనుకుంటున్నారేమో మీరు. రండి… తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి చూడండి, ఇక్కడ సెక్స్ మేనియక్ లు మంత్రులుగా ఉన్నారు, నయీం వంటి మాఫియాడాన్ సన్నిహితులు ప్రజా ప్రతినిధులుగా చెలామణి అవుతున్నారు. రాజధాని, పట్టిసీమల పేరుతో వందల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. ఉంపుడు గత్తెల పేర్ల మీద రాజధానిలో ఆస్తులు దాచేస్తున్నారు.. మంత్రుల కొడుకులు మదమెక్కి  రోడ్డుకెక్కుతున్నారు.. అంతేనా, వడ్డానాలు తీసుకుంటున్న మంత్రులు, అసెంబ్లీలో పాతేస్తామనే హెచ్చరికలు, స్పీకర్ గారి తనయుడి అక్రమాలు.. చెప్పుకుంటే చేంతాడంత! కానీ ఇక్కడ అంతా మంచోల్లే! అన్నీ నిప్పులే! ఏ ఒక్కడి మీదా చర్యలు లేవు, ఎవడినీ అడ్డుకునే వాడూ లేడు!

అదేమంటే.. ఇదంతా ప్రతిపక్ష నేత కుట్ర, ఈ విషయాల గురించి మాట్లాడే వారందరిపైనా “ఉన్మాది’’ ముద్ర వేస్తున్నారు హజారే గారూ! మీరు ఏమైనా అనుకోండి.. మా పాలకులతో పోలిస్తే కేజ్రీవాల్ అనే వ్యక్తి కోటి రెట్లు మంచోడు. విలువలున్నవాడు. ఇక్కడి నీఛుల్లా అతడు వలువలు వదిలేసి తిరగడం లేదు. సొంత పార్టీ వాళ్లని చూడకుండా సస్పెండ్ లు, బహిష్కరణలు మొదలైతే.. ముఖ్యమంత్రులకే ఇక్కడ పీఠాల్లో కూర్చునే అర్హత లేకుండా పోతుంది. కానీ ఇక్కడ కేజ్రీవాల్ లాంటి మగాళ్లు లేరు!  

ఇక మీడియా.. కేజ్రీవాల్ మీద కసిగట్టిన ముఖ్య వర్గం ఇది. ఆ జాతీయ చానళ్లలో దేశం అంటే అది ఢిల్లీ మాత్రమే! ముఖ్యమంత్రి అంటే కేజ్రీవాల్ మాత్రమే. ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని దారుణాలు జరిగిపోతున్నాయో ఎవరికీ పట్టదు. ఢిల్లీలో ఎవరైనా తుమ్మినా జాతీయ మీడియాకు జలుబు చేస్తుంది. కేజ్రీవాల్ చాయ్ సమోసాలకు కోటి రూపాయలు ఖర్చు పెట్టాడని వారం నుంచి తెగ ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనిపైనే విశ్లేషణలు, వ్యంగ్యాస్త్రాలూ వదులుతున్న జాతీయ మీడియా.. ఏపీ సీఎం ఇంత వరకూ చేసిన విదేశీ పర్యటన ఖర్చు ఎంతో ఏనాడైనా ఆరా తీసిందా? లేక తెలంగాణ సీఎం వాస్తు పేరుతో వందల కోట్లతో సచివాలయ నిర్మాణానికి పూనుకొంటున్న విషయాన్ని విశ్లేషించిందా? 

ఇక్కడి మీడియా అమ్ముడుపోయింది.. అక్కడి మీడియాకు తీరిక లేదు. కేజ్రీవాల్ మీద కస్సుమనమంటే.. అందరూ లేచి వస్తారు! మోడీ సర్కారు వచ్చిన దగ్గర నుంచి లోక్ పాల్ గురించీ మీరూ గట్టిగా మాట్లాడటం లేదు హజారేజీ! మీ వయసు కూడా అందుకు సహకరించకపోవచ్చు. కానీ.. కేజ్రీవాల్ మీద కస్సుమనడానికి మీ మనసు సహకరించడం మాత్రం  చాలా బాధకరమైన అంశం. ఆల్రెడీ కేజ్రీవాల్ ను చెడ్డవాడిగా చూపే ప్రయత్నంలో.. చాలా మంది ఉన్నారు లేండి. ఈ వయసులో మీరు కూడా అందుకోసం ఇంత కష్టపడనక్కర్లేదు. 

-జీవన్ రెడ్డి. బి

Show comments