ఉన్నదా మంచి కాలం ముందుముందునా...!

రాబోయే రోజుల్లో మంచి కాలం ఎవరికుంది? ఇప్పుడు వానాకాలం కాబట్టి సహజంగానే రైతులు రాబోయే రోజుల్లో మంచి వానలు కురుస్తాయని, కాలం కలిసివచ్చి పంటలు బాగా పండుతాయని అనుకుంటారు. బాగా వానలు కురిసే మంచి కాలం రైతులకు వస్తుందో రాదో తెలియదుగాని ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో నామరూపాలు లేకుండాపోయిన ఓ పార్టీకి మంచి రోజులు వస్తాయని ఇతర పార్టీలు అంచనా వేస్తున్నాయి.

ఓ పార్టీ గురించి ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయంటే కొద్దిగానో, గొప్పగానో మంచి కాలం వస్తుందనే అనుకోవచ్చు. ఇంతకూ కాలం కలిసివచ్చే పార్టీ ఏమిటి? నామరూపాలు లేకుండాపోయిన పార్టీ అనగానే అది కాంగ్రెసు పార్టీయేనని ఎవరికైనా తెలిసిపోతుంది.

అసలు శుభవార్త ఏమిటంటే.. ఏపీలో కాంగ్రెసు పార్టీ పుంజుకుంటోందట...! గత మూడేళ్లలో దాని ఓటింగ్‌ పది శాతం పెరిగిందట...! ఈ విషయం కాంగ్రెసు నాయకులు చెబితే విశేషమేముంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సమావేశంలో 'పచ్చ' తమ్ముళ్లకు చెప్పారు. ఎన్నికలనాటికి ఇంకొంచెం పుంజుకుంటుందేమో.

పూర్తిగా నేలమట్టమైన పార్టీ మళ్లీ మొలకెత్తుతోందంటే విశేషమే. ఇదే చంద్రబాబునాయుడు, తమ్ముళ్లు వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెసు పార్టీ కోలుకోదని, గత ఎన్నికలనాటి గతే పడుతుందని అన్నారు. కాని ఇప్పుడు పుంజుకుంటోందని చెబుతున్నారు. అంటే జాత్త్రగా ఉండండని హెచ్చరించడమన్నమాట. Readmore!

చంద్రబాబు ప్రతిపక్షాల పరిస్థితిపై చేయించిన సర్వేలో కాంగ్రెసు బలం పెరుగుతోందన్న విషయం తెలిసింది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసు పార్టీ పార్లమెంటులోనూ, బయటా పోరాటం చేయడం ఇందుకు కారణమని తెలుస్తోంది. కొంతకాలం క్రితం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభ నిర్వహించిన తరువాత కాంగ్రెసుపై ప్రజల్లో సానుకూల వైఖరి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెసు బలం పెరిగిందంటే అది దాని సొంతబలం కాదు. టీడీపీపై వ్యతిరేకతలో కొంత ఆ పార్టీ వైపు మళ్లింది. విభజన తరువాత తెలంగాణలో చాలా ఎన్నికలు జరిగాయిగాని ఆంధ్రలో జరగలేదు. దీంతో అధికార, ప్రతిపక్షాలకు తమ బలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకునే అవకాశం కలగలేదు. మున్సిపల్‌ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు జరగాల్సిన ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు.

ఆ ఎన్నికల్లో తలపడటానికి కాంగ్రెసు కసరత్తు చేసింది కూడా. ఇక వైఎస్సార్‌సీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ నాయకత్వానికి ఓ సలహా ఇచ్చారు. ఏమని? కాంగ్రెసులోని బలమైన, ప్రజాదరణ ఉన్న నాయకులను వైకాపాలో చేర్చుకోవాలని. వచ్చే ఎన్నికల్లో ఈ చేరికలు పార్టీకి ప్రయోజనం కలిగిస్తాయని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్‌ మొదలైనవారిని చేర్చుకుంటే మంచిదని ప్రశాంత్‌ కిషోర్‌ సలహా ఇచ్చారట.

గత ఎన్నికల్లో ప్రజాగ్రహం కారణంగా బలమైన నాయకులు కూడా ఓడిపోయారు. నలుగురితో నారాయణ అన్నట్లుగా కాంగ్రెసుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనం అందరు నాయకులను ఒకే గాట కట్టారు. క్రమంగా జనం ఆవేశం తగ్గుతోంది. రాష్ట్రాన్ని విభజించినందుకు ప్రాయశ్చిత్తంగా కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడటం, ఇతర సమస్యలపైనా దృష్టి పెట్టడంతో జనంలో సానుభూతి పెరిగింది.

కాంగ్రెసుకు అధికారం దక్కడం కల. ప్రధాన ప్రతిపక్షంగానూ ఉండకపోవచ్చు. కాకపోతే ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేని స్థితి నుంచి కొన్ని స్థానాలు సంపాదించుకునే స్థితికి చేరుకోవచ్చు. కాంగ్రెసుకు గత ఎన్నికల్లో శూన్యహస్తం దక్కినప్పటికీ దానికి ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఆదరణ ఉందని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

అందుకే అర్బన్‌ ప్రాంత ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ సభ జనంపై ప్రభావం చూపించినట్లు అంచనా వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యేల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయంలోనూ ప్రశాంత్‌ కిషోర్‌ కసరత్తు మొదలుపెట్టారని సమాచారం. 

నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేల పనితీరు, వారికున్న ప్రజాదరణ, ప్రజాభిప్రాయం తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ అధ్యయనం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అర్థమవుతోంది.

Show comments

Related Stories :